తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులపై చేసిన ఒక ప్రకటన అందరిని ఆకర్షించింది. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి తనను గెలిపించితే, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరతానని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌కు తన పార్టీ వారు ఎవరో చెప్పారట.దానిని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రస్తావించి ఆ కాంగ్రెస్ అభ్యర్ధి మాటలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయవద్దని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోనని అన్నారు. ఒరిజినల్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్న దివాకరరావునే ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
ఎన్నికలలో గెలవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి మాత్రం రివర్స్ వ్యూహంలోకి వెళ్లినట్లు అనుకోవాలి. కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన ఖండించి ఉండవచ్చు. కాని కేసీఆర్ ప్రకటనలోని మర్మం గురించి ఆలోచించాలి. ఒకవేళ హంగ్ వస్తే పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక పార్టీకి వేవ్ వస్తే గొడవ లేదు. తాజా సర్వేలలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రావచ్చని చెబుతున్నాయి. అయినా హంగ్ వస్తుందని నమ్మేవారు కూడా లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తన గెలిచిన అభ్యర్దులను బెంగుళూరు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
బొటాబొటి మెజార్టీతో కాని, ఎవరికి మెజార్టీ రాని పక్షంలో కాని ఫలితాలు వస్తే మాత్రం పార్టీ మార్పిడులు పెద్ద ఎత్తునే ఉండవచ్చు. కాంగ్రెస్ బొటాబొటిగా అధికారంలోకి వచ్చినా అదే పద్దతి అవలంభించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రాకపోతే మాత్రం ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్లోకి జంప్ చేసే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది నమ్మకం. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని వీలైతే అంతమందిని ఆకర్షించడానికి ప్లాన్ చేయవచ్చు.
ఎందుకంటే గత రెండు టరమ్‌లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే వ్యూహం అవలంభించి కాంగ్రెస్‌ను బాగా బలహీనపరచడానికి యత్నించారు. మొదట 2014లో కేసీఆర్ ఈ ఆలోచన చేయకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి రేవంత్‌రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించడం, తదుపరి ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది.
ఆ తర్వాత కేసీఆర్ మొత్తం వ్యూహం మార్చి అప్పట్లో టీడీపీకి ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని, కాంగ్రెస్‌లో ఉన్న 21 మందిలో పది మంది వరకు బీఆర్ఎస్లోకి లాగేశారు. ఆ వ్యూహం ఫలించి 2018 ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రజలు కేసీఆర్‌కు 88 సీట్లతో భారీ ఎత్తున పట్టం కట్టారు. అయినా కేసీఆర్ ఈసారీ వదలిపెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందికి గాను పన్నెండు మందిని బీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు. ఈ రెండు పార్టీలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
దాంతో క్యాబినెట్ హోదాలో ఉన్న సీఎల్పి నేత మల్లు భట్టి కి ప్రతిపక్ష నేతగా కూడా ఉండలేకపోయారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం. నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఆ హోదా దక్కింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దపడుతుంది. బీఆర్ఎస్ను ఎంత వీలైతే అంత బలహీన పర్చడానికి యత్నిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ ఫిరాయిస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు. బీజేపీ నేతలు అదే విషయాన్ని పదే, పదే ప్రచారం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ తాను ఈసారి కాంగ్రెస్ నుంచి గెలిచినవారిని చేర్చుకోనని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.
ఆయన నిజంగా అలా చేస్తారా?. లేక కాకతాళీయంగా మంచిర్యాలలో రాజకీయంగా నష్టం జరగకుండా ఉండడానికి, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రచారం చేస్తుంటే దానిని తిప్పి కొట్టడానికి ఇలా మాట్లాడారా అన్నది తెలియదు. ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు కాని, ఫిరాయింపులు ఉండవంటే మాత్రం ఆశ్చర్యమే కలిగిస్తుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులు అంత అడ్డగోలుగా జరుగుతుంటే చర్య తీసుకోవలసిన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బీజేపీ సైతం ఇదే తరహాలో ఉంటోంది.గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే పద్దతి అవలంభించి, ఆ తర్వాత కాలంలో బాగా నష్టపోయింది.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అది పెద్ద వివాదం అయింది. అయినా వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి ఎక్కడా భయపడకుండా ముందుకు వెళ్లి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన టీడీపీని ఖతం చేయాలనే లక్ష్యంతో పనిచేయలేదు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో నామమాత్రపు బలాన్ని మిగిల్చినా, ఇప్పుడు ప్రధాన పోటీని ఎదుర్కోక తప్పలేదు. అందువల్ల ఫిరాయింపులు జరిగినంత మాత్రాన అన్నిసార్లు అనుకూల ఫలితం వస్తుందని అనుకోలేం. గతంలో కూడా ఇలాంటివి జరగక పోలేదు.
1978 శాసనసభ ఎన్నికలలో 180 సీట్లతో కాంగ్రెస్ ఐ అధికారంలోకి రాగా, జనతా పార్టీకి 60, కాంగ్రెస్ ఆర్ కు 30 సీట్లు వచ్చాయి. కాని 1983 వచ్చేసరికి జనతా, కాంగ్రెస్ ఆర్ పార్టీలకు చెందిన తొంభై మందిలో ఐదారుగురు తప్ప అందరూ అధికార కాంగ్రెస్ ఐ లో చేరిపోయారు. అయినా 1983లో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పట్లో కొత్తగా వచ్చిన టిడిపి అధికారాన్ని కైవసం చేసుకుంది. 1984లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు టీడీపీలో చీలిక తీసుకు వచ్చినా అది నిలబడలేదు. నెల రోజుల వ్యవధిలో ప్రజాందోళన, మెజార్టీ టిడిపి ఎమ్మెల్యేలు ఎన్.టి.ఆర్.వెంట ఉండడంతో తిరిగి ఆయన ప్రభుత్వం ఏర్పడింది.
1991లో పివి నరసింహారావు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికిగాన టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. అయినా 1994లో తిరిగి ఎన్.టి.రామారావు భారీ మెజార్టీతో ఎపిలో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కాని 1995లో ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఎన్.టి.ఆర్. వెంట సుమారు ముప్పైఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన ఆకస్మిక మరణంతో టీడీపీని పూర్తి స్థాయిలో చంద్రబాబు కైవసం చేసుకున్నారు.
1999లో వివిధ పరిణామాలతో తిరిగి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. 2004 లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇరవై ఆరుగురిలో పది మంది పార్టీపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు కూడా గురయ్యారు. దీనివల్ల పార్టీకి పెద్ద సానుభూతి రాలేదు. 2009లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పది సీట్లకే పరిమితం అయింది. టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల కూటమిని ఓడించి కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి రాగలిగింది.
2014లో పవర్ లోకి వచ్చిన చంద్రబాబు వైసీపీని దెబ్బతీయాలని ఫిరాయింపులను ప్రోత్సహించినా 2019 ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డారు. కేవలం ఫిరాయింపుల వల్లే పార్టీలు బలపడతాయనో, బలహీనపడతాయనో అనుకోవడానికి లేదని ఈ అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితులు, నాయకత్వం తదితర అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ అనుభవాల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఫిరాయింపుల పర్వాలు ఎలా ఉంటాయో తెరపై చూడాల్సిందే.
👉 – Please join our whatsapp channel here –