ముంబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తితిదేకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) నుంచి అనుమతులు వచ్చాక తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ విద్యుత్ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీంతో ఏటా తితిదేకు రూ.కోటి ఆదా అవుతుందని చెప్పారు. తితిదే అవసరాలకు 15 ఏళ్ల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలిమరలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ వారే చూసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారని ఈవో తెలిపారు. కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –