తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు విజయం కోసం చాలా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అటు.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం బాగా జరిగింది అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.
డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారు.. ఇవాళ్టి ప్రజా తీర్పు శ్రీకాంత్‌చారికి అంకితం చేస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రజలు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్ జోడో ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు.
అమరవీరులకు అంకితం..
ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజయంలో 30 లక్షల నిరుద్యోగుల పట్టుదల ఉందని పేర్కొన్నారు.
ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం చేేస్తున్నట్లు చెప్పారు. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన థాక్రేకు ధన్యవాదాలు తెలిపారు.
‘సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్ఎస్ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాతీర్పును అందరూ శిరసావహించాలి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
గేట్లు తెరిచే ఉంటాయి..
ప్రగతి భవన్ పేరును మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇకపై డా. అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయం గేట్లు సామాన్య ప్రజలకు సదా తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అందరం కలిసి నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –