Politics

‘ఇండియా’ కూటమిపై ధ్వజమెత్తిన మోదీ

‘ఇండియా’ కూటమిపై ధ్వజమెత్తిన మోదీ

మూడు రాష్ట్రాల్లో భాజపా (BJP) విజయం.. నిజాయతీ, పారదర్శకత, సుపరిపాలనలకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఈ మూడు విజయాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా హ్యాట్రిక్‌కు గ్యారంటీ ఇచ్చాయని తెలిపారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Election Results) భాజపా ఆధిక్యం సాధించిన నేపథ్యంలో.. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించారు. కాషాయదళంపై ప్రేమను కురిపించినందుకుగానూ మూడు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ.. తెలంగాణలోనూ భాజపాకు మద్దతు లభించిందన్నారు. తప్పుడు హామీలు, గాల్లో మాటలను ఓటర్లు విశ్వసించలేదంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

‘ఎన్నికల సమయంలో కులాల వారీగా దేశాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నించారు. పేపర్ లీక్‌, నియామకాల్లో కుంభకోణాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణాల్లో అధికార పక్షాల ఓటమికి కారణమయ్యాయి. అవినీతిపరులకు అండగా నిలిచిన, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించినవారికి, ‘ఘమండియా (అహంకారపూరిత)’ కూటమికి.. ఈ విజయాలు స్పష్టమైన హెచ్చరిక. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసినవారిని ప్రజలు తిరస్కరించారు. దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే రాజకీయాలకు పాల్పడొద్దు. అందరూ ఒక వేదికపైకి వస్తే.. మంచి ఫొటోలు, మీడియా ముఖ్యాంశాలు లభిస్తాయి. కానీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరు. మీ మార్గాలను సరిదిద్దుకోండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు పంపుతారు’ అని కాంగ్రెస్‌ సహా విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల శక్తులన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తాయని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వాటితో పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z