Politics

నోటాకు ఎన్ని ఓట్లు!

నోటాకు ఎన్ని ఓట్లు!

భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్లు ఏ అభ్యర్థినీ ఇష్టపడని పక్షంలో ఏమి చేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే 2013 ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. 2013 తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ ప్రవేశపెట్టారు. అయితే నోటాపై ఓటర్ల స్పందన ఎలా ఉందనే ప్రశ్న ‍ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ అందరి మదిలో తలెత్తుతుంది.

దీనిని తెలుసుకునేందుకు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో నోటా వినియోగం గురిచం పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తియిన నాలుగు రాష్ట్రాల డేటాను అనుసరించి చూస్తే.. మూడు రాష్ట్రాల్లో, ఒక శాతం కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని స్పష్టమైంది.

మధ్యప్రదేశ్‌లో నమోదైన 77.15 శాతం ఓటింగ్‌లో 0.98 శాతం మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.26 శాతం మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో నోటా బటన్‌ను నొక్కారు. తెలంగాణలో 0.73 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. తెలంగాణలో 71.14 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్‌లో 0.96 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో 74.62 శాతం ఓటింగ్ జరిగింది.

‘నోటా’ ఆప్షన్‌ వినియోగం గురించి కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘యాక్సిస్ మై ఇండియా’కు చెందిన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ నోటా అనేది ఎన్నికల్లో .01 శాతం నుంచి గరిష్టంగా రెండు శాతం వరకు ఉపయోగితమవుతోంది. భారతదేశంలో అమలవుతున్న ‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ సూత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ విధానంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఓటర్లు.. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని భావించినప్పుడు వారు నోటాకు ఓటు వేయవచ్చు. అయితే నోటా ఆప్షన్‌ను ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటేనే జనం నాడి తెలుస్తుందని, ప్రయోజనం ఉంటుందని, లేనిపక్షంలో అది లాంఛనప్రాయం అవుతుందని ప్రదీప్ గుప్తా అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z