Politics

సీఎం పేరు ప్రకటించకముందే సంచ‌ల‌నం సృష్టిస్తున్న భ‌ట్టి ట్వీట్

సీఎం పేరు ప్రకటించకముందే సంచ‌ల‌నం సృష్టిస్తున్న భ‌ట్టి ట్వీట్

తెలంగాణ సీఎం ఎవ‌ర‌నేది ఫైన‌ల్ అయిపోయింది. పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న రేవంత్ రెడ్డి పేరునే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కాంగ్రెస్ అధిష్టానం ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికాసేప‌ట్లో సీఎం పేరును సీఎల్పీ స‌మావేశంలో ప్ర‌క‌టించ‌నున్నారు. తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అర్హుడినన్న భ‌ట్టి విక్ర‌మార్క‌కు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న అంతిమ నిర్ణ‌యంతో నిరాశే ఎదురైంది. దీంతో చివ‌రి నిమిషం వ‌ర‌కు సీఎం ప‌ద‌వి కోసం పోటీ ప‌డ్డ మధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క.. సీఎం పేరు ప్ర‌క‌ట‌న‌కు ముందు చేసిన ట్వీట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే భ‌ట్టి ఈ ట్వీట్ చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పాద‌యాత్ర సంద‌ర్భంగా తాను అడుగుపెట్టిన నియోజ‌వ‌క‌ర్గాల‌న్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింద‌ని భ‌ట్టి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తానే కాంగ్రెస్ పార్టీ గెలుపున‌కు కార‌కుడిని అని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకున్నారు.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌తి పేద‌వాడి గుండెను తాను తాకిన‌ట్లు భ‌ట్టి పేర్కొన్నారు. గుండె నిండా ఆత్మ స్థైర్యంతో ముందుకు క‌దిలాల‌న‌ని తెలిపారు. నైరాశ్యంలో ఉన్న క్షేత్ర స్థాయి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశనే త‌న పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయ‌న్నారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని పాద‌యాత్ర చేసి పార్టీ విజ‌యానికి కృషి చేశాన‌ని చెప్పారు. 1364 కిలోమీటర్లు, 109 రోజుల్లో పాద‌యాత్ర పూర్త‌యింద‌న్న భ‌ట్టి.. అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ విజయం సాధించింద‌ని స్ప‌ష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z