Agriculture

పీఎం కిసాన్‌ సాయం పెంపు పై స్పందించిన కేంద్రం

పీఎం కిసాన్‌ సాయం పెంపు పై స్పందించిన కేంద్రం

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం- కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN)కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే అంశంపై కేంద్రం మరోసారి స్పందించింది. ఈ పథకం కింద ఏటా ఇచ్చే రూ.6వేల సాయం మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ అంశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‘‘ఇప్పటికైతే.. పీఎం కిసాన్‌ మొత్తాన్ని రూ.6వేల నుంచి పెంచే ప్రతిపాదన ఏమీ లేదు’ అని స్పష్టంచేశారు. దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6వేలు చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఇస్తున్న పీఎం కిసాన్‌ మొత్తాన్ని పెంచుతారంటూ గతంలో పలు సందర్భాల్లో ప్రచారం జరగ్గా.. తాజాగా మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు దేశంలోని అర్హులైన 11 కోట్ల మందికి పైగా రైతులకు 15 ఇన్‌స్టాల్‌మెంట్లలో రూ.2.81లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) పథకాల్లో పీఎం కిసాన్‌ ఒకటని మంత్రి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z