ఏపీలో ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తి వేసింది. ఫలితాలను విడుదల చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డును న్యాయస్థానం ఆదేశించింది. ఎస్సై నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థుల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో సరిపడా ఎత్తు లేరని 5 వేల మంది అభ్యర్థులను తిరస్కరించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అయితే, తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ఎత్తు అంశంలో అభ్యంతరం తెలిపిన అభ్యర్థులకు న్యాయస్థానం నియమించిన సభ్యుల సమక్షంలో ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు. నియామక బోర్డు తీసుకున్న కొలతలు, బృందం సమక్షంలో తీసిన కొలతలు సరిపోలినట్లు గుర్తించారు. దీంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించిన అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని బోర్డును ధర్మాసనం ఆదేశించింది.
👉 – Please join our whatsapp channel here –