Politics

Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ ఖరారు

Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ ఖరారు

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరా? అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీఎంగా అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. డిసెంబర్‌ 7న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటి వరకు ప్రతిష్టంభన నెలకొంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సోమవారం ఏక వాక్య తీర్మానం చేశారు. దీనిని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అధిష్ఠానానికి చేరవేశారు. దీనిపై ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేశారు. మంత్రివర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z