రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను చేయిపట్టి నడిపించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా కొత్తగా మరో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. విశాఖలోని టెక్నాలజీ సెంటర్ లాగానే వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటుకానుంది.
సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో కేంద్ర ప్రతినిధులు పరిశీలించిన సుమారు 19.5 ఎకరాల భూమిని కేటాయించాలి్సందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి కేంద్ర అదనపు కార్యదర్శి రజనీష్ లేఖ రాశారు.
విశాఖలో తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అధికంగా ఉండటంతో జనరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారని, అదే తరహాలో కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఉండటంతో ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు అనుగుణంగా టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ను వినియోగించుకునేలా సంబంధిత పరిశ్రమలతో ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
దీనికి సంబంధించి త్వరలోనే అధ్యయనం చేసి ఏ విభాగానికి చెందిన టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నదానిపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపనున్నారు. ఈ టెక్నాలజీ సెంటర్‌లో అధునాతనమైన ల్యాబ్‌లతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్ప కాలిక కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానిక యూనిట్లలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –