ScienceAndTech

చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ ప్రారంభం

Chandrayan2 CountDown Started - President In Sriharikota

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం 6.51 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 20 గంటలపాటు కొనసాగిన తర్వాత సోమవారం వేకువజామున 2.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ- మార్క్‌ 3 ఎం1 వాహక నౌక ద్వారా చంద్రయాన్‌ -2ని రోదసీలోకి పంపనున్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగ వీక్షణకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ దంపతులు, గవర్నర్‌ నృసింహన్‌ దంపతులు‌ శ్రీహరికోటకు ఈ రోజు చేరుకోనున్నారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో రోవర్‌, ల్యాండర్‌, ఆర్బిటర్‌ అనుసంధానం చేశారు. దీని బరువు 3,447 కిలోలు. ఇందులో ప్రొపెల్లర్‌ బరువు 1179 కిలోలు. ప్రయోగం జరిగిన అయిదు రోజుల తరువాత భూ నియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశిస్తోంది. అక్కడ నుంచి 3.5 లక్షల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు పయనించనుంది. సెప్టెంబరు 6,7 తేదీల్లో చంద్రునిపై ల్యాండర్‌ కాలుమోపే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.