అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత శాఖ ద్వారా పరిశీలించి పలు అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల ద్వారా పలు అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
అంగన్‌వాడీల సమ్మె కారణంగా అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆందోళన విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో విధులకు గైర్హాజరైనట్లుగా భావించి సంబంధించిన జీవోల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది.
ఆమోదం తెలిపిన అంశాలివీ..
* అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం.
* అంగన్‌వాడీ కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచేందుకు నిర్ణయం.
* హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం.
* సహాయకులకు అంగన్‌వాడీ కార్యకర్తలుగా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకారం.
* టీఏ, డీఏలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేయడానికి ఆమోదం.
* రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం.
మేలు చేసిన సీఎం జగన్
* వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు చేస్తూ పలు చర్యలు తీసుకుంది. అందులో కొన్ని ఇవీ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకూ టీడీపీ హయాంలో అంగన్‌వాడీల జీతం నెలకు రూ.7 వేలు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్‌వాడీల జీతాలను పెంచుతూ జీఓ 18 జారీ చేసింది. అంగన్‌వాడీల జీతాలను రూ.11,500కి పెంచుతూ 2019 జూన్ 26న జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసింది. గత నాలుగేళ్లుగా పెంచిన వేతనం అమలవుతోంది.
* అంగన్‌వాడీ కార్యకర్తలతోపాటు మినీ అంగన్‌వాడీ వర్కర్లకు కూడా గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు.
* సహాయకులకు గత ఎన్నికలకు ముందు వరకు రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. వీటిని జీవో 18 ద్వారా ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది.
* టీడీపీ హయాంలో 2019 వరకూ అంగన్‌వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్‌వాడీ సహాయకులు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీతాలు పెంచి అందించింది.
* మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది.
* 2013 నుంచి అంగన్‌వాడీలకు పదోన్నతులు (ప్రమోషన్లు) ఇవ్వలేదు. గత సర్కారు దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది.
* సూపర్‌వైజర్ పోస్టుల పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయో పరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది.
* ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి రూ.1,313 కోట్లు అందించింది. జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికీ వర్తింపజేసింది. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా డేటా కూడా ఇస్తోంది. 2023 జూలై 1 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది.
* ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపచేస్తూ ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది.
* అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించింది. నాడు–నేడు ద్వారా అంగన్‌వాడీల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోంది.
* గర్భిణులు, బాలింతలు, పిల్లలకు హోం రేషన్ పద్ధతిని అమలు చేస్తోంది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –