Politics

లోక్‌సభలో కట్టుదిట్టమైన భద్రత

లోక్‌సభలో కట్టుదిట్టమైన భద్రత

పార్లమెంట్‌ (Parliament)పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభ (Lok sabha)లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్‌ గ్యాలరీ (public gallery) నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు.

లోక్‌సభలోకి దూకిన వ్యక్తి.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి ‘నల్ల చట్టాలను బంద్‌ చేయాలి’ అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్‌ సభను వాయిదా వేశారు. జీరో అవర్‌లో భాజపా ఎంపీ ఖగేన్‌ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మరోవైపు, అదే సమయంలో పార్లమెంట్‌ భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళనకు యత్నించారు. పసుపు, ఎరుపు రంగుల పొగను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్‌లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్‌ను వదిలారు. ఎంపీలు వెంటనే వారిని పట్టుకున్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్‌ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ అని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు దిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు.

https://assets.eenadu.net/eenaduvideos/parliment13122023.mp4#amp=1

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z