కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్గదర్శి ఎండీ సీహెచ్.శైలజా కిరణ్‌కు వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ వ్యవహారంపై ఏపీ సీఐడీ (AP CID) అధికారులు శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు క్షమాపణ లేఖలను అందజేశారు. మార్గదర్శి ఎండీకి ఎల్వోసీ జారీలో కోర్టు ఉత్తర్వుల పట్ల ఎలాంటి అవిధేయత లేదని పేర్కొంటూ అదనపు డైరెక్టర్ జనరల్ ఎన్.సంజయ్, అదనపు ఎస్పీ ఎస్.రాజశేఖర్‌రావు, డిప్యూటీ ఎస్పీ సీహెచ్.రవికుమార్ వేర్వేరుగా క్షమాపణ లేఖలను అందజేశారు. వాటిని అంగీకరించాలని కోరారు. ఎల్వోసీ జారీ చేసిన విషయంలో మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై శుక్రవారం జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. అధికారులు సమర్పించిన క్షమాపణ లేఖలను సీఐడీ తరఫు న్యాయవాది అందజేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి అఫిడవిట్ దాఖలు చేయకుండా లేఖలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. క్షమాపణను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు.
👉 – Please join our whatsapp channel here –