ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక (Cargo Ship) అరేబియా సముద్రం (Arabian Sea)లో హైజాక్ (Hijack)కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం (Indian Navy) అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ నౌకను రంగంలోకి దించింది. ఈ మేరకు భారత నేవీ శనివారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
‘‘డిసెంబరు 14 రాత్రి సమయంలో ఎంవీ రుయెన్ నౌక యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) పోర్టల్‌లో మేడే (అత్యవసర పరిస్థితిని తెలియజేసే) సందేశం పంపింది. నౌకలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారని ఆ మెసేజ్ సారాంశం. దీంతో భారత నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న నావల్ మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది’’ అని నేవీ తెలిపింది.
హైజాక్‌కు గురైన ఆ నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. నౌకపై వారు నియంత్రణ కోల్పోయినట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. రుయెన్ నౌకకు సాయం చేసేందుకు భారత నేవీ విమానం, యుద్ధ నౌక అక్కడకు చేరుకున్నాయి. ప్రస్తుతం అది సోమాలియా తీరం దిశగా ప్రయాణిస్తోంది. దాని పైనుంచే నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయాణిస్తోంది. మరోవైపు, ఈ తెల్లవారుజామున భారత యుద్ధనౌక విజయవంతంగా రుయెన్ నౌకను అడ్డగించినట్లు నేవీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.
2017 తర్వాత సోమాలియా పైరెట్లు (సముద్రపు దొంగలు) నౌకలపై జరిపిన తొలి అతిపెద్ద దాడి ఇదే. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు యూకే నౌకాదళం హెచ్చరికలు పంపింది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –