Devotional

ధనుర్మాస వ్రత విశిష్టత

ధనుర్మాస వ్రత విశిష్టత

#ధనుర్మాస వ్రతం#

🍁మార్గశిరం శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో చేసే పూజలు, నిర్వహించుకునే పర్వదినాల వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘మాసానాం మార్గశీర్షిహం’ అన్నాడు కృష్ణభగవానుడు. మార్గాలలో శ్రేష్ఠమైనది, ఉపయోగకరమైందని మార్గశీర్షం పేరుకు అర్ధం. నెలలో వేకువజామున స్నానం చేసి శ్రీకృష్ణుణ్ని స్మరిస్తూ పాటలు పాడటం, తులసి దళాలతో పూజించడం శుభప్రదమని అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. వృశ్చిక రాశి నుంచి భానుడు ధనూరాశిలోకి ప్రవేశించే పుణ్యకాలాన్ని ధనుస్సంక్రమణం అంటారు. వాడుకలో ఈ మాసాన్నే ధనుర్మాసమని వ్యవహరిస్తారు.

🍁ఈ మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే శ్రీవ్రతం అనీ వ్యవహరిస్తారు. ముప్పై పాటల నోము అని కూడా అంటారు. ఈ ధనుర్మాస కాలం ప్రకృతి పూజలకు, నోములకు అనుకూలంగా ఉంటుంది. హేమంత రుతువు కనక మొక్కల ఆకులు రాలి కొత్త చివుళ్లు తొడిగి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. సూర్యుడి ఎండలో తాపం తగ్గి నునువెచ్చగా హాయిగా అనిపిస్తుంది. నదుల్లోని నీటి ప్రవాహాలు నెమ్మదించి స్నానాదికాలకు అనువుగా ఉంటాయి. ఈ ప్రకృతి అందాలకు తోడుగా వైష్ణవ ఆలయాల్లో తెల్లవారుజామున పెద్దయెత్తున పూజలు, పాశురాల గానాలతో హృదయాల్లో దైవీ భావనలు పొటమరిస్తాయి. రోజూ వినిపించే సుప్రభాతాల స్థానే తిరుప్పావై పాశురాలు మధురాతి మధురంగ వినిపిస్తుంటాయి. ఈ గేయాలను గానం చేస్తూ పూలమాలలు సిద్ధం చేస్తూ ధనుర్మాసానికి అంతులేని పవిత్రత భక్తిభావనలను కల్పించిన పారమార్ధికురాలు
గోదాదేవి.

🍁శ్రీకృష్ణుడిపై ప్రణయ భావాలను తన పాటలతో సమాజ పరం చేసిన గోదాదేవిని ఆండాళ్ అని పిలుచుకుంటారు. ఈమె (పెంపుడు) తండ్రి విష్ణుచిత్తుడికి- శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి కోవెలకు చెందిన తులసివనంలో గోదాదేవి లభించింది. విష్ణుచిత్తుడు విష్ణు భక్తుడు. ఆయనలోని భక్తి తత్పరత సహజంగానే గోదాదేవికి అబ్బింది. గోదాదేవి శ్రీకృష్ణుణ్ని స్తుతిస్తూ రాసిన గేయాలను తమిళంలో పాశురాలు అంటారు. భక్తిని రంగరించి తండ్రి స్తుతించిన స్తోత్రాలు గోదాదేవిపై అద్భుత ప్రభావాన్ని చూపాయి.

🍁భాగవత పురాణంలో శ్రీకృష్ణుడిపై వలపుతో గోపకన్యలు తెలతెలవారుతుండగా నిద్రలేచి యమునా నదిలో స్నానాలు చేసి ఆ మాధవుణ్ని స్మరిస్తూ పాటలు పాడి స్వామిపై విరహం చెంది కాత్యాయనీ వ్రతం చేశారు. చివరకు ఆ కస్యలు మాధవుణ్ని పెళ్ళాడాం విష్ణుచిత్తుడు చెబుతుండగా విన్న గోదమ్మ తానూ ఆ వ్రతం చేసి శ్రీహరిని పెళ్ళాడాలని కోరిక పెంచుకొని పదహారేళ్ల వయసులో నిర్ణయించుకుందని ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నాడు.

🍁వటపత్రశాయి కోసం అల్లిన మాలను తన మెడలో వేసుకుని కోవెల ఆవరణలోని బావిలో తన ప్రతిరూపాన్ని గోదాదేవి చూసుకునేదని చెబుతారు. ఈ బావి ఆ కోవెలలో నేటికీ ఉంది. తాను తన చెలులతో కూడి ఆ గ్రామంలోని తటాకంలో గోదాదేవి జలకాలాడేదట. ప్రతి రోజూ ఒక గేయం(పాశురం) గానం చేస్తూ ధనుర్మాసంలో శ్రీవ్రతాన్ని చేసింది. చివరికి ఆమె శ్రీకృష్ణుడి (రంగనాథస్వామి)లో ఐక్యమై తరించింది. గోదాదేవి రాసిన పాశురాలను ఒక ప్రబంధంగా భావిస్తారు. భగవంతుడి పాదాల వద్ద శరణాగతి పొందడం, భగవంతుడి ఆశ్రయం పొందడమే జీవిత పరమావధి అని గోదాదేవి నొక్కి చెప్పింది. పన్నెండు మంది ఆళ్వారుల్లో ఆమె ఒక్కరే మహిళ. శ్రీహరి భక్తుల హృదయాల్లో ఆమె నిరంతరం పూజలందుకొంటోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z