DailyDose

యాపిల్ నుంచి వాటర్ ప్రూఫ్ ఎయిర్‌పాడ్స్-వాణిజ్యం-07/15

Apple To Release New WaterProof Airpods-Today Business News-July152019

* మరో రెండు నెలల్లో యాపిల్ కొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేయనుంది. అయితే ఫోన్లతోపాటు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అవి కూడా వాటర్ ప్రూఫ్ ఎయిర్పాడ్స్. వీటిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ప్రవేశపెడుతుందని చెప్తున్నారు.
* ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌ మి అవతరించిన నాటి నుంచి అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు మొబైల్‌ ఫోన్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మరో ప్రీమియం మొబైల్‌ను విడుదల చేసింది.
*ఫార్మా, ఐటీ రంగాలకు ప్రపపంచ వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉండటంతో సోమవారం ట్రేడింగ్‌లో ఆ షేర్లు బాగా లాభపడ్డాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 169 పాయింట్లు పెరిగి 38,905 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 11,589 వద్ద ముగిశాయి. చైనా జీడీపీ డేటా మధుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
* ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు పెట్రోలు ధర 14 పైసలు పెరిగింది. అయితే డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఈ పెంపుతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.77.75కు చేరింది. డీజీల్ మాత్రం 72.14 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ రోజు పెట్రోల్ ధర లీటర్ కు రూ.74.44లు ఉండగా, దానికి అనుకుని ఉన్న విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర 77.09 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.21లుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో ఈ రోజు పెట్రోల్ ధర రూ79.82 లు గా ఉంది.
*ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ కావడంతో, జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం జూన్లో 94 శాతం పెరిగి, రూ.32,241.33 కోట్లకు చేరిందని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ) వెల్లడించింది.
*విశాఖపట్నం (సింహాద్రి) వద్ద 25 మెగావాట్ల సోలార్ ఫొటోవోల్టాయిక్ (ఎస్పీవీ) విద్యుత్ ప్లాంటు నెలకొల్పేందుకు ఎన్టీపీసీ నుంచి రూ.100 కోట్ల ఆర్డరు లభించిందని భెల్ తెలిపింది.
*పౌరుల విదేశీ పర్యటనలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉండటం, వెల్లడించని ఆదాయం.. తదితర వివరాలు తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ సామాజిక మాధ్యమాలను ఆశ్రయించబోతోందన్న వార్తల్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్మన్ పీసీ మోదీ ఖండించారు.
*5జీ సహా ఇతర స్పెక్ట్రమ్ వేలం కోసం రూపొందించిన ముసాయిదా ఆర్ఎఫ్పీ (టెండర్ పత్రం)కి అంతర్ మంత్రిత్వ సంఘం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
*దేశీయ విమానయాన విపణిలో దాదాపు సగం వాటా కలిగిన ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో, గవర్నెన్స్ లోపాలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి.