Politics

ముగిసిన యువగళం పాదయాత్ర

ముగిసిన యువగళం పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara lokesh) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి లోకేశ్‌ తన పాదయాత్ర ముగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తెదేపా, జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపుసంద్రాన్ని తలపించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు పాదయాత్ర సాగింది. సోమవారం ముగించే సమయానికి లోకేశ్‌ 3,132 కి.మీ. నడిచినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రనూ అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంటుతో ఇప్పుడు లోకేశ్‌ కూడా అక్కడే తన పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను తెదేపా భారీ ఎత్తున నిర్వహిస్తోంది.

తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లాంటి సందర్భాల్లో తప్ప విరామం లేకుండా పాదయాత్ర కొనసాగించారు. సెప్టెంబరు 9న చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంతో… పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద విరామం ఇచ్చి, 79 రోజుల తర్వాత నవంబరు 27న మళ్లీ అక్కడినుంచే పునఃప్రారంభించారు. యువగళం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం తొలిరోజు నుంచీ ప్రయత్నించింది. జీవో నం.1ని చూపించి అవరోధాలు సృష్టించింది.

కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం చేరేలోపు పోలీసులు 25 కేసులు నమోదుచేయగా, వాటిలో మూడు లోకేశ్‌పైనే ఉన్నాయి. ప్రచారరథం, సౌండ్‌సిస్టమ్‌, స్టూల్‌ సహా అన్నింటినీ సీజ్‌ చేశారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు లాంటిచోట్ల వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై తెదేపా శ్రేణుల్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారు సహా 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. యువగళం ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం లాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. వాటికి దీటుగా సమాధానం చెబుతూ యువగళం పాదయాత్రను విజయవంతంగా కొనసాగించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z