ScienceAndTech

అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్‌డీ వీడియో

అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్‌డీ  వీడియో

అంతరిక్ష పరిశోధనల్లో నాసా (NASA) కీలక పురోగతిని సాధించింది. లేజర్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్‌డీ వీడియోను భూమికి పంపింది. సుమారు 31 మిలియన్‌ కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియో ప్రసారం కావడం విశేషం. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అంతరిక్షంలోని వ్యోమనౌకలో ఉన్న టాటర్స్ అనే పిల్లి లేజర్‌ లైట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. డీప్‌ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్ ప్రయోగం (DSOC)లో భాగంగా సోమవారం ఈ వీడియోను ప్రసారం చేసినట్లు నాసా ట్వీట్ చేసింది. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో అంతరిక్షం నుంచి భూమి మీదకు డేటా, ఫొటో/వీడియోలను పంపేందుకు, మానవుల అంగారక యాత్రకు ఉపయోగపడుతుందని తెలిపింది.

అంతరిక్షంలో అంగారక-గురు గ్రహాల మధ్య ఉంటూ.. సూర్యుని కక్ష్యలో తిరుగుతున్న గ్రహశకలం పైకి ఈ ఏడాది అక్టోబరులో నాసా ‘సైకీ’ అనే వ్యోమనౌకను (Psyche Spacecraft) పంపింది. కొద్ది రోజుల క్రితం దీనిలో ట్రాన్సీవర్‌ భూమి మీదకు విజయవంతంగా లేజర్‌ సంకేతాన్ని పంపింది. సోమవారం వ్యోమనౌక నుంచి ఎన్‌కోడెడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సిగ్నల్‌ను అమెరికాలోని శాన్‌ డియాగో కౌంటీలో ఉన్న ‘కాల్‌టెక్‌ పలోమర్‌ అబ్జర్వేటరీ’ కేంద్రంలోని ‘హాలే టెలిస్కోప్’ అందుకుంది. ఆ తర్వాత దానిని దక్షిణ కాలిఫోర్నియాలోని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ పరిశోధనాశాలకు (JPL) పంపింది. అక్కడ వీడియోను డీకోడ్‌ చేసినట్లు జేపీఎల్ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బిల్ క్లిప్‌స్టెయిన్‌ తెలిపారు. దీంతో మిలియన్‌ మైళ్ల దూరం నుంచి బ్రాడ్‌బ్యాండ్ వీడియోలను ప్రసారం చేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z