* పెరిగిన కూరగాయల ధరలు
మొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నగరంలో నిన్న చికెన్ ధరలు కొండేక్కాయి.. నేడు కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ పెరిగిన ధరలు సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి.. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి… కానీ ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం లేదని జనాలు వాపోతున్నారు..గత సోమవారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా తగ్గాయి.. అందులో చికెన్ ధరలు వందకు పడిపోయాయి.. దీంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. దానితోపాటు చలికాలం కావడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, పంట చేతికి సరిగా అందకపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయి.. ప్రస్తుతం బీన్స్ ధరలు రూ. 50 ఉండగా, చిక్కుడు కాయల ధరలు మాత్రం రూ. 65 దగ్గర ఉన్నాయి.. అదే విధంగా దొండకాయలు 50 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, అతి తక్కువగా అంటే టమాటో ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది..అంతేకాదు ఉల్లి, వెల్లుల్లితో పాటుగా అల్లం, ఆకుకూరల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. హోల్‌సేల్ లో కిలో వెల్లుల్లిపై ధర 240 పలుకుతోంది ఇక పావు కిలో అల్లం ధర 40 రూపాయలు ఉండగా కిలో అల్లం ధర 150 రూపాయలకు పైనే ఉంది అంటూ వ్యాపారాలు చెప్తున్నారు.. మొన్న కురిసిన వర్షాలకు పంట లేకపోవడం.. నాణ్యత లేకపోవడం, కొత్త పంట రాకపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.. కాయ కష్టం చేసుకొని నోటికి రుచిగా తినడానికి లేకుండా పోయింది సామాన్యులకు.
* షారూఖ్ ఖాన్ భార్యకు ఈడీ నోటీసులు
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపింది. షారూఖ్ భార్య గౌరీఖాన్ రూ.30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తులసియానీ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు గౌరీఖాన్. ఈ కేసులో మంగళవారం (డిసెంబర్ 19న) ఈడీ ఆమెకు నోటీసులు అందించింది. పెట్టుబడిదారులు, బ్యాంకులకు సుమారు రూ.30 కోట్ల ఆర్థిక నష్టం కలిగించిందని తులసియానీ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌరీఖాన్ పై కేసు నమోదైంది. తాజాగా ఈడీ నోటీసులు పంపించింది. ఈ కేసుకు సంబంధించి గౌరీఖాన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఈడీ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.తులసియానీ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి గౌరీ ఎంత డబ్బు తీసుకున్నారనే కోణంలోనూ ఈడీ అధికారులు విచారించనున్నారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హోదా కోసం చేసుకున్న ఒప్పందాలు, అందుకు సంబంధించిన వివరాలను కూడా రాబట్టనున్నారు.ముంబైకి చెందిన కిరీట్ జస్వంత్ షా అనే వ్యక్తి 2015లో తులసియానీ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాజెక్టులోని ఫ్లాట్ ను రూ.85 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే.. ఈ కంపెనీ షా నుంచి డబ్బులు తీసుకున్నాక ఫ్లాట్ ఇవ్వలేదు. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. చివరకు పోలీసులకు ఆశ్రయించాడు బాధితుడు. తులసియానీ గ్రూప్ డైరెక్టర్లు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, బ్రాండ్ అంబాసిడర్ ఉన్న గౌరీఖాన్ పైనా కిరీట్ జస్వంత్ షా ఫిర్యాదు చేశారు.2023, మార్చిలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. షారుఖ్ ఖాన్ భార్య, సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్ గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి గౌరీఖాన్ పై ఆరోపణలు రావడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈడీ నోటీసులపై గౌరీఖాన్ ఇంతవరకు స్పందించలేదు.
* అమెజాన్ బెస్ట్ ఇయర్ ఎండ్ సేల్
ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి సరికొత్త మోడల్‌లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్‌లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. రూ. 1,383 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కూడా అందిస్తుంది.. అమెజాన్ అందిస్తున్న టాప్ బ్రాండ్ లో ఆపిల్ ఐఫోన్ 13 ఒకటి. ఇందులో ఎ15 బయోనిక్ చిప్‌సెట్, 6.1-అంగుళాల సూపర్ ఉన్నాయి. రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, వెడల్పు, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ 12ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్, 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో కూడా వస్తుంది.. అలాగే మరో టాప్ బ్రాండ్ వన్ ప్లస్ ఫోన్ల పై కూడా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించారు.. అంతేకాదు శాంసంగ్ ఫోన్‌లు కూడా తక్కువ ధరలకు పొందవచ్చు. శాంసంగ్ మోడల్‌లలో ఒకటి గెలాక్సీ ఎమ్34 5జీ, 5ఎన్ఎమ్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ, 6.6-అంగుళాల పూర్తి-హెచ్‌డీ తో వస్తుంది.. మంచి వెరియంట్స్ లలో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది.. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.. ఇక కెమెరా విషయానికొస్తే పండగే.. అదిరిపోయేలా ఉన్నాయి.. భారీ తగ్గంపుతో వస్తున్న ఈ ఫోన్లను కొనుగోలు చెయ్యండి.
* లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. పలు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 71,479.28 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నది. ఇంట్రాడేలో 71,071 కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఆ తర్వాత మళ్లీ కోలుకొని 71,623.71 పాయింట్ల పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 122.10 పాయింట్ల లాభంతో 71,437.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.45 పాయింట్ల లాభంతో 21,453.10 వద్ద స్థిరపడింది.
* గోఫస్ట్‌ను కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్ ఆసక్తి
దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న విమానయాన సంస్థ గోఫస్ట్‌ను కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్ ఆసక్తి చూపుతోంది. దీంతో పాటు షార్జాకు చెందిన స్కై వన్ కంపెనీ, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టే శాఫ్రిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ బిడ్లు దాఖలు చేయొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గోఫస్ట్ వివరాలను మదింపు చేయాల్సిందిగా దివాలా ప్రక్రియను చూస్తున్న పరిష్కార నిపుణుడి(ఆర్‌పీ)ని ఈ మూడు సంస్థలు కోరినట్లు సమాచారం. అయితే గోఫస్ట్ కోసం దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిశాక, ఈ అభ్యర్థన వచ్చినట్లు తెలుస్తోంది. గోఫస్ట్ ఆస్తుల లిక్విడేషన్ అవకాశాలను రుణదాతలు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలతో సోమవారం బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు 19.84 శాతం లాభపడి, రూ.64.21 వద్ద స్థిరపడింది.ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు తమ విమానాల్లో 10 కోట్ల మంది ప్రయాణించినట్లు ఇండిగో తెలిపింది. ఈ ఘనత సాధించిన తొలి దేశీయ విమానయాన సంస్థగా నిలిచామని పేర్కొంది. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలిచామని తెలిపింది. ‘ఒక ఏడాది కాలంలో 10 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తొలి భారతీయ విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించామ’ని ఇండిగో వివరించింది. గతేడాది దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా 7.8 కోట్ల మంది ప్రయాణికులను ఇండిగో చేరవేసింది. ఈ ప్రకారం చూస్తే ప్రస్తుత సంవత్సరంలో ఇండిగో విమాన ప్రయాణికుల సంఖ్యలో 22 శాతం వృద్ధి కనిపించింది.
* ఓయో హోటల్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్
దేశవ్యాప్తంగా ఓయో హోటల్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది.. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా, రెండో స్థానంలో బెంగుళూరు ఉంది..ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.. ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది..అదే విధంగా బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలవగా.. గోవా, మైసూర్, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరీ మొదటి ప్లేస్ లో నిలవగా.. అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.. అలాగే గోరఖ్‌పుర్, దిఘా, వరంగల్, గుంటూర్ వంటి నగరాలు కూడా కిందటేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ రూమ్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తుంది..ఇదిలా ఉండగా రాష్ట్రాల వారీగా చూస్తే..ఉత్తర్‌ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓయో తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఓయో నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 30న అత్యధిక బుకింగ్స్ నమోదు అయినట్లు నివేదికలో తెలిపారు. అత్యధికంగా బుకింగ్స్ నమోదైన నెలగా మే నెల నిలిచింది. ఇతర లాంగ్ వీకెండ్‌లతో పోలిస్తే సెప్టెంబర్ 30- అక్టోబర్ 2 మధ్య లాంగ్ వీకెండ్ అత్యధిక రూమ్స్ బుక్ అయినట్లు ఓయో తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –