హైదరాబాద్‌కు సోమవారం మరో రైడ్-బుకింగ్ యాప్ ‘యారీ’ పరిచయమైంది. అయితే ఇప్పటికే ఉన్న ఓలా, ఉబర్, రాపిడో వంటి రైడ్-బుకింగ్ యాప్స్‌కు పోటీగా నగరంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం ద్వారా దీన్ని తీసుకురావడం విశేషం. కాగా, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ప్రోటోకాల్స్‌పై ఈ యాప్‌ను నిర్మించారు.
హైదరాబాద్‌లోని 20వేలకుపైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు యారీలో భాగస్వాములు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇతర నగరాల్లో కూడా ఈ సేవల్ని ప్రారంభించే దిశగా వెళ్తున్నట్టు యారీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈవో హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయా నగరాల్లోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాలతో చర్చిస్తున్నట్టు ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. ‘డ్రైవర్ల కోసం డ్రైవర్లతో ఏర్పాటైనదే ఈ యారీ. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం, వారికి శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా, వారి వ్యాపార, ఆదాయ మార్గాల రక్షణార్థం యారీ యాప్‌ను అభివృద్ధి చేశాం. డ్రైవర్లు ఎవరికీ కమీషన్లు ఇవ్వనక్కర్లేదు. ప్రయాణీకులకూ విశ్వసనీయమైన, ప్రయోజనకరమైన సేవలు అందుతాయి’ అని హరిప్రసాద్ అన్నారు.
అన్నివిధాలా అండగా..
డ్రైవర్లకు, వారి కుటుంబాలకు బీమా, న్యాయపరమైన సహాయం కూడా అందిస్తామని హరిప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు. తమ యాప్ సేవలకుగాను నామమాత్రపు ఫీ తీసుకుంటామన్నారు. రాబోయే 6 నెలల్లో దేశవ్యాప్తంగా 20 లక్షలకుపైగా కస్టమర్లు, లక్షకుపైగా డ్రైవర్లే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు చెప్పారు. యారీ డ్రైవర్లకు వారికి అనువైన సమయంలోనే పనిచేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, మొబైల్ నెంబర్ సాయంతో యారీ పార్ట్‌నర్ యాప్‌ను ఆటో, ట్యాక్సీ డ్రైవర్లెవరైనా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని హరిప్రసాద్ వివరించారు. ప్రయాణికులు ఉచితంగానే ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి యారీ రైడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
👉 – Please join our whatsapp channel here –