Politics

కలెక్టర్లతో సీఎం సమావేశం వాయిదా

కలెక్టర్లతో సీఎం సమావేశం వాయిదా

అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం(21న) నిర్వహించ తలపెట్టిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్షలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై జిల్లా పాలనాధికారులు అందరూ తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లగా.. ఆ మేరకు వారు సిద్ధమయ్యారు. అయితే శాసనసభ సమావేశాలు కొనసాగుతుండడం, దిల్లీలో గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానుండడం తదితర కారణాలతో కలెక్టర్లతో సమావేశాన్ని వాయిదా వేసినట్లుగా తెలిసింది.

సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర మంత్రి భగవంత్‌ భేటీ
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. శాసనసభ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీకి వచ్చారు. సీఎం కార్యాలయంలో రేవంత్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి భగవంత్‌ ఖుబా అభినందించారు. కేంద్ర మంత్రికి కూడా సీఎం శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z