విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు సీఎం చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
‘‘ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలి. టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారు. దీనిపై ఆనాడే మేం పోరాటం చేస్తే.. మార్షల్స్‌తో మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారు. ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకోగా.. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1362కోట్ల భారం పడింది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం. వ్యవసాయ విద్యుత్ అనేది ప్రజల సెంటిమెంట్. దీని ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారు. వాటితో ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారు’’ అని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. 24 గంటల విద్యుత్‌పై అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు. యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లయినా పూర్తికాలేదని రేవంత్ గత ప్రభుత్వాన్ని విమర్శించారు.
👉 – Please join our whatsapp channel here –