‘కాథల్-ది కోర్’ (Kaathal – The Core) సినిమాలో తొలిసారి జ్యోతిక-మమ్ముట్టి (Mammootty) కలిసి నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మమ్ముట్టితో కలిసి నటించిన అనుభూతిని జ్యోతిక తాజాగా పంచుకుంది. నిజమైన సూపర్ స్టార్ మమ్ముట్టినే అని ఆమె పేర్కొంది.
‘‘నేను చాలామంది దక్షిణాదికి చెందిన సూపర్ స్టార్స్‌తో నటించాను. కానీ, నిజమైన సూపర్‌స్టార్ మమ్ముట్టినే. ‘కాథల్-ది కోర్’ షూటింగ్ సమయంలో ఆయన్ని తొలిసారి కలిశాను. ఇక ఇందులో ఆయన వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించారు. ఇలాంటి పాత్రను ఎందుకు ఎంచుకున్నారని ఆయన్ని అడిగాను. దానికి ఆయన హీరో అంటే ఏంటో చాలా గొప్పగా చెప్పారు. ‘అసలు హీరో అంటే విలన్‌లను కొట్టడం, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మాత్రమే కాదు. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకోవాలి. ఎలాంటి పాత్రల్లోనైనా నటించగలగాలి’ అని వివరించారు. అందుకే ఆయన్ని సూపర్‌స్టార్ అనకుండా ఉండలేను’’ అని జ్యోతిక (Jyothika) వెల్లడించారు.
ఇక నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కాథల్-ది కోర్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలకు ముందు వార్తల్లో నిలిచిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. నటి సమంత కూడా ఈ సినిమాపై ఇటీవలే తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రమని. అందరూ చూడాల్సిన శక్తిమంతమైన సినిమాగా అభివర్ణించారు. జీయోబాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును చూపించారు.
👉 – Please join our whatsapp channel here –