Health

తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 పాజిటివ్‌ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తెలంగాణలో కొత్తగా మరో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.

తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా, వైరస్‌ నుంచి ఒకరు కోలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 20 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో 19 మందికి చికిత్స జరుగుతోంది. ఇక, నేడు హైదరాబాద్‌లో నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. ఈరోజు 925 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇంకా 54 మందికి సంబంధించి కోవిడ్‌ టెస్టు రిజల్ట్‌ రావాల్సి ఉందని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. వరంగల్‌ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్‌ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, ఎంజీఎం అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్‌ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్‌1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z