సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. రాజకీయ పార్టీని ప్రకటించారు.. కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఈ రోజు మీడియా సమావేశంలో పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.. “జై భారత్ నేషనల్ పార్టీ” పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు వీవీ లక్ష్మీ నారాయణ.. జాతీయ జెండా రంగులతో జేడీ ఫొటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారు.. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం.. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీగా అభివర్ణించారు.
రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీవీ.. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణమన్న ఆయన.. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజే ముద్దన్నారు కొందరు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు మరికొందరు.. కానీ, మెడలు వంగలేదు.. ప్రత్యేక హోదా రాదని దుయ్యబట్టారు. అయితే, ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని ప్రకటించారు. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడమని స్పష్టం చేశారు. వాళ్లు తిన్నారని వీళ్లు.. వీళ్లూ తిన్నారని వాళ్లు అంటున్నారు. వాళ్లూ.. వీళ్లూ తిన్నారని సభల్లో ప్రకటించిన వాళ్లు మద్దతిస్తున్నారని విమర్శించారు. మేం మాత్రం అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని వెల్లడించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
👉 – Please join our whatsapp channel here –