సెలవు దొరికితే ఇంట్లో ఉండడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. అలాంటిది వరుసగా 4 రోజులు సెలవులొస్తే ఆగుతారా.. శని, ఆదివారాలకు తోడు సోమ, మంగళవారాలు కూడా తోడవ్వడంతో నగరానికి చేరువగా ఉన్న రిసార్టులతో పాటు పర్యాటక ప్రాంతాలకు పరుగులు పెట్టారు. రిసార్టుకు వెళ్తే చక్కటి ఆహారం, పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలాలకు కొదవ ఉండదు. నాలుగు రోజులు అక్కడే విహరించడానికి నగర ప్రజలు శుక్రవారం మధ్యాహ్నం నుంచే బయలుదేరారు. అంతేకాదు.. డిసెంబరు ఆరంభం నుంచి సంక్రాంతి వరకూ నగరం నుంచి అన్ని ట్రావెల్ సంస్థలూ యాత్రలు నిర్వహిస్తున్నాయి. ఏడాదిలో చివరి నెల.. అందులోనూ క్రిస్మస్ సెలవులు వచ్చేసరికి నగరవాసులు చాలామంది గోవా, కర్ణాటక, ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లకు ప్రయాణమయ్యారు. దీంతో దేశీయ విమాన సర్వీసులు కిక్కిరిశాయి. అలాగే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు పెద్దఎత్తున వెళ్లారు.
దేశీయ పర్యటనలతో పాటు శ్రీలంక, ఈజిప్టుకు దగ్గరలోని అజర్‌బైజాన్, సింగపూర్, మలేషియా, మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్ యాత్రలకు మంచి డిమాండ్ ఉందని ‘డాట్’ (డైరక్షన్ ఆఫ్ ట్రావెల్ టూర్స్) ప్రతినిధి ప్రేమ్‌కుమార్ చెప్పారు. దుబాయ్ వెళ్లాలంటే 5 రోజుల యాత్ర మొత్తానికి రూ. 80 వేల వరకూ తీసుకుంటున్నారు. శ్రీలంక యాత్రకు లయితే రూ. 60 వేలతో చుట్టేసి వచ్చేయవచ్చునని పలు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు. కొవిడ్ భయాలు పర్యాటకుల్లో లేవని.. రెండు నెలల క్రితమే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు ఎవరూ ప్రయాణాలు రద్దు చేసుకోలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
సూపర్ సేవర్ డే పాస్
వరుస సెలవులతో మెట్రో సూపర్ సేవర్ రూ.59 డే పాస్‌తో అపరిమితంగా ప్రయాణించే అవకాశం మెట్రో కల్పిస్తోంది. నాలుగో శనివారం, ఆదివారం సెలవులతో పాటూ సోమవారం క్రిస్‌మస్, మంగళవారం బాక్సింగ్ డే సెలవు ఉండటంతో నాలుగు రోజుల పాటు డే పాస్ వినియోగించుకోవచ్చని తెలిపింది. 31వ తేదీ ఆదివారం, జనవరి 1న సూపర్ సేవర్‌కార్డు వర్తిస్తుందని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –