DailyDose

ఉద్యోగులకు చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం!

ఉద్యోగులకు చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం!

ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో ఎవరైనా బీమా తీసుకుంటే.. పాలసీ గడువు ముగిసిన నెలరోజుల్లోపే పాలసీదారుడి ఖాతాలో డబ్బు జమవుతుంది. ఉద్యోగులు తమ మూల వేతనంలో 15 నుంచి 20 శాతం వరకు బీమా ప్రీమియం చెల్లించడానికి వెసులుబాటు ఉంటుంది. పాలసీ గడువు ముగిసినా లేదా ఉద్యోగి మరణించినా బీమా తక్షణమే ప్రభుత్వం చెల్లించేది. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల బీమా సొమ్ములు కూడా వాడేసింది. ఎంతోమంది ఉద్యోగుల పాలసీల గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా ఇంకా వారి ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రూ.36 కోట్లు పెండింగ్‌
ఉమ్మడి అనంత జిల్లాలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ బీమా శాఖ ద్వారా బాండ్లు తీసుకున్నారు. వాటి గడువు ముగియడంతో సొమ్ముల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది మే నుంచి బీమా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1600 మంది ఉద్యోగులు ఈ డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు.

రూ.36 కోట్ల వరకు బీమా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని లెక్కతేలింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కాలం ముగిసిన బాండ్లు సమర్పించి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏడాదిన్నర దాటినా సొమ్ములు రాకపోవడంతో ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రతి నెలా జీతంలో మినహాయించి ప్రీమియం చెల్లించారు. గడువు ముగిసినా డబ్బులు జమ కాకపోవడం ఏంటని ఏపీజీఎల్‌ఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజు ఏపీజీఎల్‌ఐ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పాలసీ గడువు ముగిసిన నెలరోజుల్లోపు డబ్బు ఇవ్వలేదు. ఏడాదిన్నర తర్వాత చెల్లిస్తే దానికి వడ్డీ ఎవరు చెల్లిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించని బీమా సొమ్ము రూ.35 కోట్లపై 8 శాతం వడ్డీ లెక్కించినా నెలకు రూ.2.80 కోట్లు ఆదా అవుతుంది. ఈ వడ్డీ పెండింగ్‌లో ఉన్న పాలసీదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించే అవకాశం లేదు.

పాలసీలపై రుణం
గడువు ముగిసిన బాండ్లకు ప్రభుత్వం డబ్బు చెల్లించకుండా పెండింగ్‌ పెట్టింది. గడువు ముగియని బాండ్లపై మాత్రం రుణం మంజూరు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్ల వరకు ఉద్యోగులకు బీమా సొమ్ములు చెల్లించాలి. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతోనే బాండ్లపై రుణాలిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. గడువు ముగిసిన బాండ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇంకా అమల్లో ఉన్న బాండ్లపై రుణాలు ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరో ఎత్తు వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

గతంలో గడువు ముగిసిన బాండ్లను నేరుగా ఏపీజీఎల్‌ఐ ద్వారా సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేసేవారు. ప్రస్తుతం ఉద్యోగులు పనిచేసే కార్యాలయాల డీడీఓల ద్వారా పంపించాలని ఒక మెలిక పెట్టారు. కార్యాలయాల డీడీఓలు బాండ్లను పరిశీలన చేసి పంపడం చాలా ఆలస్యమవుతోందని వాపోతున్నారు. దీనిపై ఏపీజీఎల్‌ఐ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. గడువు ముగిసిన బాండ్లకు రెండేళ్ల నుంచి డబ్బు రాని విషయం వాస్తవమేనని అధికారులు అంగీకరించారు.

ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?
బాండ్ల గడువు ముగిసి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు బీమా సొమ్ములు ఖాతాకు జమ కాలేదు. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రెండేళ్లకు సంబంధించి వడ్డీ చాలా నష్టపోతున్నాం. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం పెండింగ్‌ బీమా చెల్లిస్తే వడ్డీతో సహా చెల్లిస్తే న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. – నరసింహులు, ఎస్‌జీ ఉపాధ్యాయుడు

కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా..
ఏపీజీఎల్‌ఐకి సంబంధించి నా బాండ్ల గడవు ఏడాది దాటినా ప్రయోజనం కనిపించలేదు. ఇప్పటికే అనేకసార్లు ఏపీజీఎల్‌ఐ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా డబ్బు చెల్లిస్తే బావుంటుంది. కాలయాపన చేస్తే వడ్డీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z