కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీపి కబురు చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని విమర్శించారు. హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. హుజూర్‌నగర్‌లో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు మాత్రమే కట్టిందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టామన్నారు. హుజూర్‌నగర్‌లో 2,160 ఇళ్లు పూర్తి చేసి, రాబోయే 3, 4 నెలల్లో అర్హులైన పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇరిగేషన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.
భారాస హయాంలో అవినీతి, దుర్మార్గ పాలన: ఉత్తమ్
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. భారాస హయాంలో అవినీతి, దుర్మార్గ పాలన సాగిందని ఆరోపించారు. నీటిపారుదల శాఖలో అనేక లోటుపాట్లు ఉన్నాయన్నారు. చెక్‌డ్యామ్‌లపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. గ్యాస్ స్కీమ్‌ను త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –