DailyDose

కైకాల విగ్రహం ఆవిష్కరణ-తాజా వార్తలు

కైకాల విగ్రహం ఆవిష్కరణ-తాజా వార్తలు

రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యం

మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని మళ్ళీ మనమే గెలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లు ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నేతలతో మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాలపై చర్చించారు. అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని తుమ్మల హామీ ఇచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, అందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

కైకాల విగ్రహం ఆవిష్కరణ

కృష్ణా జిల్లా గుడివాడలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని.. కైకాల కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. ఎంత చెప్పినా తరగని చరిత్ర కైకాలది అని కొనియాడారు.. కైకాల అంటే మనవాడు అన్న భావన అందరిలో ఉందన్న ఆయన.. వ్యక్తిగా మొదలై లెజెండ్ గా ఎదిగిన మహోన్నతుడు కైకాల సత్యనారాయణ అన్నారు. నాడు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన కైకాల తన ప్రభావంతో.. మాగంటి బాబు, శారదలను గెలిపించారు.. అలాంటి సత్తా ఆయన సొంతం అన్నారు కొడాలి నాని.ఇక, రెండు కోట్ల సీఎస్ఆర్ నిధులతో గుడివాడలో చిరస్థాయిగా నిలిచేలా కైకాల కళామందిరం నిర్మిస్తాం అని ప్రకటించారు ఎంపీ బాలసౌరీ.. సినీ రంగంలో ఎంతమంది ఉన్నా మర్చిపోలేని నటుడు కైకాల సత్యనారాయణ అని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, కళా రంగంలో ఓనమాలు నేర్చుకున్న గుడివాడలో కైకాల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అన్నారు కైకాల సోదరుడు నాగేశ్వరరావు. కాగా, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుడిగా ఎదిగిన దివంగత కైకాల సత్యనారాయణపై గతంలోనూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రశంసలు కురిపించారు. సత్యనారాయణ ఒక మహానుభావుడు అని.. వ్యక్తిగతంగా ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని.. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గుడివాడ అభివృద్ధికి ఆయన కృషి చేశారని కొనియాడిన విషయం విదితమే.

*   క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి

హుస్నాబాద్‌లో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం తరుపున పండుగ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్ని అమలు చేస్తాం. హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ లో కరం విద్యార్థులకు కారం పెట్టిన ఘటన పై కలెక్టర్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పాను. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్, ఆర్టీవో కార్యయలం ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నాం. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, భూ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషి చేస్తా. హుస్నాబాద్ నియోజక వర్గాన్ని నిర్లక్ష్యం చేయనని క్రిస్మనస్ సాక్షిగా చెప్తున్న. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తాను. 24 గంటలు నియోజర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను, క్రైస్తవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతాం’ అన్నారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలి!

 భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీని విస్మరించి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలని.. కేంద్రాన్ని కోరుతున్నానని అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ చేశామో.. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నామన్నారు. పీవీ నర్సింహరావుకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. శనివారం పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సంద‌ర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారతదేశాన్ని గాడిన పెట్టీ పీవీ తన వంతు దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని కొనియాడారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు నివాసానికి ప్రశాంత్‌ కిషోర్‌

తెదేపా అధినేత చంద్రబాబు తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో  ప్రశాంత్ కిషోర్ వైకాపా తరఫున ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌ తో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌ కనిపించారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరిట తెదేపాకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

టీడీపీ సీనియర్‌ నేతకు షాక్‌

ఆ నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం డామినేషన్ ఉందని చెప్పుకునేవారు. కాని గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది. అందుకే ఈసారి అక్కడ మళ్ళీ పట్టు నిలుపుకోవాలని పచ్చ పార్టీ బాస్‌ తెగ ఆరాటపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేను కాకుండా బాగా డబ్బు ఖర్చు పెట్టగల అభ్యర్థిని దించాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. చంద్రబాబు తీరుతో ఈసారి టిక్కెట్ రాదేమోనని ఆ మాజీ ఎమ్మెల్యేకు గుండె దడ మొదలైందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ అంటే..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తమ్ముళ్లు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట. ఎవరికి వారే తమకే టిక్కెట్టు దక్కుతుందని ఇన్నాళ్లూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నేతలకు చంద్రబాబు నిర్ణయాలు షాకిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. 2014లో సైకిల్ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పార్టీ ముక్కలు చెక్కలైంది. అయితే, ఈసారి ఎలాగైనా పెనమలూరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెనమలూరు టిక్కెట్ కోసం టీడీపీలో పెద్ద ఫైటే నడుస్తోందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్ వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారట. వీరంతా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ టిక్కెట్ తమదే అని చెప్పుకుంటున్నారట.ఇలాంటి సమయంలో చంద్రబాబు పెనమలూరు నియోజకవర్గంలో వీరందరినీ కాదని వేరే అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులతో ఎవరి వెంట నడవాలో అర్ధంకాక తలపట్టుకుంటున్న క్యాడర్ చంద్రబాబు తాజా నిర్ణయంతో మరింత కన్ఫ్యూజన్‌లో పడ్డారట. పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాలు బలమైనవి. దీంతో, ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుత టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడే అయినప్పటికీ 2024 ఎన్నికల్లో దండిగా ఖర్చు పెట్టగలిగిన కమ్మనేతను బరిలోకి దించాలనుకుంటున్నారట చంద్రబాబు.బోడే ప్రసాద్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ధీటైన అభ్యర్ధి కాదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవినేని ఉమా లేదా కేశినేని చిన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరెవరూ కాకపోతే కొనకళ్ల నారాయణ తమ్ముడు కొనకళ్ల బుల్లయ్యను బరిలోకి దించి బీసీ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.ఈక్రమంలోనే గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య పాల్గొంటున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పటి వరకూ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్‌కు ఈ పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రోడ్డెక్కి నిరనసలు చేసిన తనను కాదని ఇప్పుడు మరో అభ్యర్ధిని నిలబెట్టాలని చూడటంపై బోడే లోలోన రగిలిపోతున్నాడట.ఆమధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దీక్షలు చేపట్టిన సమయంలో బోడే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎవరెవరో వచ్చి తమకే టిక్కెట్ అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. అప్పటి ఆవేదన ఇప్పుడు నిజమైతే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బోడే ప్రసాద్ కుమిలిపోతున్నారట.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z