Business

30న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

30న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

దేశంలో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్‌ తరహాలో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (Amrit Bharat Express) త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్య వేదికగా డిసెంబర్‌ 30న ఈ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. మరో ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనూ ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ డిసెంబర్‌ 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి దిల్లీ-దర్బంగా (బిహార్‌)మార్గంలో ప్రయాణించనుంది. మరో అమృత్‌ భారత్‌ బెంగాల్‌లోని మాల్దా- బెంగళూరు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరో ఆరు వందే భారత్‌ రైళ్లకు సైతం ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇవి అయోధ్య- ఆనంద్‌ విహార్‌ (దిల్లీ), వైష్ణోదేవి- దిల్లీ, జాల్నా- ముంబయి, కోయంబత్తూర్‌- బెంగళూరు, అమృత్‌సర్‌ – దిల్లీ, మంగళూరు సెంట్రల్‌ – మడ్గావ్‌ మధ్య అందుబాటులోకి రానున్నాయి.

అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫీచర్లు ఇవే..
అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నాన్‌ ఏసీ రైలు పుష్-పుల్‌ రైలు. ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతోపాటు, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్‌లు ఉండనున్నాయి. 12 సెకండ్‌ క్లాస్‌ త్రీటైర్‌ స్లీపర్‌ కాగా.. 8 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్స్‌ ఉంటాయి. ఈ 2 కంపార్ట్‌మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైలు టికెట్‌ ధరలు? ఏయే రూట్లలో వీటిని తీసుకురానున్నారు? వంటి వివరాలు త్వరలో తెలియరానున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z