మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ (ఆహార భద్రత) కార్డు (Ration Card) ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా.. లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్‌కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో ఆదివారం నిర్వహించే కాన్ఫరెన్స్‌లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌కార్డుల సంఖ్య 89.98 లక్షలు కాగా… ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. అయితే రేషన్‌కార్డు డేటాబేస్‌తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది.
‘ఉజ్వల’ గ్యాస్ కనెక్షన్లకు రూ.340 రాయితీ అందుతోంది. మొత్తం కనెక్షన్లలో ఇవి 11.58 లక్షలు ఉన్నాయి.
రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.
ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నెలా సిలిండర్ రీఫిల్ చేసుకునేవారు 44 శాతం మంది మాత్రమే ఉన్నారు.
కొత్త కార్డులు పొందే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –