మెదడుపై కొవిడ్-19 దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తోందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా కొవిడ్ సోకిన సమయంలో పక్షవాతం, మెదడువాపు తదితర లక్షణాలతో బాధపడిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉందని, వీరిలో మెదడు దెబ్బతింటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీల శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనను ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్ ప్రచురించింది. పరిశోధనలో భాగంగా.. కొవిడ్-19 సోకిన కొన్ని నెలల తర్వాత చాలా మందిని పరిశీలించారు. వీరికి వాపు ప్రక్రియ సూచించే పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. వీరిలో మెదడు దెబ్బతింటున్న దాఖలాలు కనిపించడం గమనార్హం. ‘‘కొందరిలో లక్షణాలు సాధారణంగానే ఉన్నాయి. తలనొప్పి, కండరాల నొప్పి లాంటి వాటితోనే బాధపడుతున్నారు. కానీ కొవిడ్ సమయంలో పక్షవాతం, ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడిన వారిపై మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాల ఆధారంగా సంబంధిత వ్యక్తుల జ్ఞాపకశక్తి, వారు స్వతంత్రంగా ఆలోచించే తీరు ఏ మేరకు ప్రభావితం కానుందో మున్ముందు అధ్యయనం చేయాలి’’ అని పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బెండిక్ట్ మైఖేల్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –