* వాహన పరిశ్రమలో 2023లో రికార్డు స్థాయి విక్రయాలు
ఈ ఏడాది వాహన రంగంలో రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. అయితే, కొత్త సంవత్సరంలో అమ్మకాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విద్యుత్ వాహనాలు (Electric Vehicle) సహా ఇతర స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహనాలను స్వీకరించడానికి వినియోగదారులు సిద్ధమవుతున్నారు.ప్రయాణికుల వాహన విక్రయాలు ఈ ఏడాది ముగిసే నాటికి 40 లక్షల యూనిట్లు దాటేస్తాయని అంచనా. జనవరి నుంచి ధరలు పెరుగుతుండడం సహా సంవత్సరాంతపు ఆఫర్లతో డిసెంబర్ చివర్లో అమ్మకాలు గణనీయంగా పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే, వచ్చే ఏడాది విక్రయాల వృద్ధి కాస్త మందగిస్తుందని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ.భార్గవ అంచనా వేశారు. ఈ తరుణంలో వాహన పరిశ్రమలో వేగవంతమైన వృద్ధి కోసం చిన్న కార్ల విభాగాన్ని పునరుద్ధరించడం చాలా అవసరమన్నారు. ప్రయాణికుల వాహన విభాగంలో ఎంట్రీ లెవెల్ కార్ల వాటా 2018-19లో 14 శాతంగా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ నాటికి అది 4 శాతానికి తగ్గింది.వచ్చే ఏడాది విద్యుత్ వాహన విక్రయాలు (Electric Vehicle Sales) పుంజుకుంటాయని భార్గవ అంచనా వేశారు. అయితే, తటస్థ కర్బన ఉద్గార లక్ష్యాన్ని సాధించే దిశగా ఇతర హరిత సాంకేతికతలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు అన్ని విభాగాల్లో ఈవీల వాటా పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు. మొత్తంగా 2024లో వాహన విక్రయాల ఔట్‌లుక్ సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫేమ్ స్కీమ్ (FAME Scheme) 2024 మార్చిలో ముగియనుండగా.. ప్రభుత్వం మరోకొత్త పథకంతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఈవీలు లభిస్తాయన్నారు. ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్’ అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆటోమొబైల్ రంగం (Automobile Industry) స్థిరమైన వృద్ధికి సిద్ధంగా ఉందని అంచనా వేశారు. ప్రయాణికుల వాహన విభాగంలో తక్కువ వృద్ధి నమోదవుతుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో అత్యధిక వృద్ధిని అంచనా వేశారు. మరోవైపు ఎస్‌యూవీలకు వచ్చే ఏడాది మరింత గిరాకీ ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం 49 శాతంగా ఉన్న వీటి వాటా వచ్చే ఏడాదికి 50 శాతం మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఏడాది మరిన్ని కొత్త వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. అలాగే కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. విలాసవంతవైన కార్ల విభాగంలోనూ వచ్చే ఏడాది మంచి వృద్ధి నమోదవుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి.
* దాతృత్వంలోనే ఐఐటీ-బాంబే పూర్వ విద్యార్థులు భేష్
విద్య నేర్పిన గురువు.. చదువుకున్న విద్యా సంస్థ పట్ల విద్యార్థులకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి. తాము చదువుకున్న విద్యా సంస్థ మరింత సమున్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బాంబే (ఐఐటీ-బీ) పూర్వ విద్యార్థులు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భవిష్యత్‌లో విద్యార్థులకు విద్యాబోధన కోసం 1998’ బ్యాచ్ విద్యార్థులు రూ.57 కోట్ల విరాళం అందజేశారు. ఇప్పటి వరకు దేశంలోని ఐఐటీల్లో పూర్వ విద్యార్థులు అందజేసిన విరాళాల్లో ఇదే గరిష్టం. ఇంతకుముందు 1971వ బ్యాచ్ విద్యార్థులు తమ స్వర్ణోత్సవాల సందర్భంగా రూ.41 కోట్ల విరాళం అందించారు.భవిష్యత్ విద్యార్థుల ఆకాంక్షలకు మద్దతుగా ఐఐటీ-బాంబేలో క్రిటికల్ అకడమిక్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం 1998 బ్యాచ్ విద్యార్థులు ఈ విరాళం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతోపాటు స్టూడెంట్ ఎయిడ్ ఇన్షియేటివ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రో ఫ్యాక్టరీ, శాస్త్రీయ సాంకేతిక ఆవిష్కరణలకు మార్కెట్ స్పేస్ ల్యాబ్స్ స్థాపించడానికి ఈ నిధులు ఖర్చు పెట్టాలని సూచించారు. అలాగే సెంటర్ ఫర్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా మైండ్స్ (సీ-మైన్‌డీఎస్) లో ఎండోమెంట్ ఫండ్, ఫండ్ ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉపయోగించాలని సూచించారు.ఈ విరాళం అందజేసిన వారిలో వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ, సిల్వర్ లేక్ మేనేజింగ్ డైరెక్టర్ అపూర్వ సక్సేనా, గూగుల్ డీప్ మైండ్ ఏఐ రీసెర్చ్ దిలీప్ జార్జ్, గ్రేట్ లెర్నింగ్ సీఈఓ మోహన్ లఖంరాజు, పీక్ ఎక్స్‌వీ ఎండీ శైలేంద్ర సింగ్, అమెరికాస్ @ హెచ్‌సీఎల్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీకాంత్ శెట్టి తదితర 200 మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో వివిధ స్టార్టప్ సంస్థల నుంచి కార్పొరేట్ సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశిష్ చౌదరి మాట్లాడుతూ.. ఈ విరాళం తమ సంస్థలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, పరిశోధనలు చేపట్టేందుకు ఉపకరిస్తుందన్నారు. వచ్చే ఏడేండ్లలో ప్రపంచంలోనే టాప్-50 విశ్వవిద్యాలయాల్లో ‘ఐఐటీ-బాంబే’ను నిలిపేందుకు పూర్వ విద్యార్థుల చొరవ ఉపకరిస్తుందన్నారు.
* విమాన టికెట్లపై విస్తారా క్రిస్మస్ ఆఫర్లు
విమానయాన సంస్థ ‘విస్తారా ఎయిర్‌లైన్స్’ (Vistara Airlines) క్రిస్మస్ ఆఫర్లను (Christmas Sale) ప్రకటించింది. వీటిల్లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల టికెట్ల ధరలపై రాయితీలు అందిస్తోంది. ఇప్పటికే (డిసెంబర్ 21) ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ 23న ముగియాల్సి ఉండగా.. సేల్‌ను డిసెంబరు 25 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు 2024 సెప్టెంబరు 30లోపు వాటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.ఈ ప్రత్యేక సేల్‌లో దిబ్రూగఢ్- గువహటి (Dibrugarh-Guwahati) వెళ్లటానికి ఎకానమీ క్లాస్‌లో టికెట్ ధరను రూ.1924గా విస్తారా నిర్ణయించింది. ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో రూ.2,234, బిజినెస్ క్లాస్‌లో రూ.9,924 నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది. అయితే రాయితీలు ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాఠ్‌మాండూ, ఢాకా, సింగపుర్, జెడ్డా, దమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
వాహనదారులు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ఆయిల్ కంపెనీలు వీటి ధరలను ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. కానీ కొన్ని నెలల నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర: రూ. 109. 66,లీటర్ డీజిల్ ధర: రూ. 98. 31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర: రూ. 110. 48.లీటర్ డీజిల్ ధర: రూ. 98
విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర: రూ. 111. 76,లీటర్ డీజిల్ ధర: రూ. 99.
* 3 నెలల ముందే ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై చేసిన సీబీడీటీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2023-24)నికి ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి అవసరమైన ఫామ్‌లను మూడు నెలల ముందే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలను నోటిఫై చేసింది. గత ఆర్థిక సంవత్సర (2022-23) ఐటీఆర్ ఫామ్‌లను గత ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన తర్వాత విడుదల చేసిన సీబీడీటీ ఈసారి సుమారు మూడు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేయడం ఆసక్తి కర పరిణామం.సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐటీఆర్ ఫామ్‌లపై సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ ఏడాది డిసెంబర్‌లోనే జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయంపై వేతన జీవులు, వ్యాపారులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు వచ్చే ఏడాది జూలై 31 తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుందని సీబీడీటీ తెలిపింది.వేతన జీవులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై వచ్చే ఏడాది (2024-25) అంచనా సంవత్సరం అంచనా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు తమ వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.50 లక్షలు దాట కుంటే ఐటీఆర్-1 (సహజ్) ఫామ్ ఎంపిక చేసుకోవాలి. రూ.50 లక్షల్లోపు ఆదాయం గల హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు ఐటీఆర్-4 (సుగమ్) ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
* పూర్వ విద్యార్థుల దాతృత్వం
తాము చదువుకున్న విద్యాసంస్థకు విరాళాలు అందజేసే విషయంలో ఐఐటీ- బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థులు మరోసారి ఆదర్శంగా నిలిచారు. 1998 పాసవుట్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ‘ఐఐటీ- బాంబే’కు రూ.57 కోట్ల విరాళం అందజేశారు. తమ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ సందర్భంగా ఈ సాయానికి ముందుకొచ్చారు. ఒకే బ్యాచ్‌కు సంబంధించి ఇదే అత్యధిక విరాళం కావడం విశేషం. గతంలో 1971 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్ జూబ్లీ సంబరాల సందర్భంగా రూ.41 కోట్లు అందజేశారు.సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ XV ఎండీ శైలేంద్ర సింగ్, వెక్టార్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ, గూగుల్ డీప్‌మైండ్‌కు చెందిన దిలీప్ జార్జ్ తదితర 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఇందులో భాగమయ్యారు. ఐఐటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఈ విరాళం సాయపడుతుందని ‘ఐఐటీ బాంబే’ డైరెక్టర్ సుభాశీష్ చౌధురి తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి 50 విశ్వవిద్యాలయాల్లో ‘ఐఐటీ బాంబే’ను నిలపాలనే లక్ష్యానికి పూర్వ విద్యార్థుల చొరవ దోహదపడుతుందన్నారు.ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, ఇతర పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ఈ విరాళానికి ముందుకొచ్చినట్లు 1998 బ్యాచ్‌కు చెందినవారు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ‘ఐఐటీ బాంబే’ను ప్రపంచ ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిపేందుకు, ఇతర పూర్వ విద్యార్థులను కూడా దాతృత్వ సహకారం దిశగా మళ్లించేందుకు తమ ప్రయత్నం సాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నందన్ నీలేకని గతంలో రెండు సందర్భాల్లో ‘ఐఐటీ బాంబే’కు రూ.315 కోట్లు, రూ.85 కోట్ల చొప్పున విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –