రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే చౌక బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడితే ఎంతటి వారు అయినా కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ రేషన్ దుకాణాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. పేదలకు అందించే బియ్యానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందన్నారు. ఈ బియ్యాన్ని కొందరు గత ప్రభుత్వంలోని నాయకులు, అధికారుల అండదండలతో రీసైక్లింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రేషన్ మాఫియా ఆగడాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
‘‘2014లో భారాస అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు రూ.3,300 కోట్లు. ప్రస్తుతం వడ్డీ భారమే ఏడాదికి రూ.3,000 కోట్లు ఉంది. గత ప్రభుత్వం ఈ శాఖని నిర్లక్ష్యం చేయడంతో కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భారీగా బియ్యం నిల్వలు ఉంచుకోవడానికి రాష్ట్రంలో స్థలం లేదు. బియ్యం నిల్వలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ముందుకొచ్చినా.. గత ప్రభుత్వం విక్రయించకుండా గోదాముల్లోనే ఉంచి పాడవడానికి కారణమైంది. ఆ రాష్ట్రాలకు బియ్యం విక్రయాలను పరిశీలిస్తున్నాం. కార్పొరేషన్‌ను ప్రమాదకర స్థితి నుంచి రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్ వివరించారు.
👉 – Please join our whatsapp channel here –