* లోక్‌సభలోనూ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి షాక్ తగిలేలా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలే మళ్లీ రిపీట్ అయ్యేలా కన్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 సీట్లల్లో మాత్రమే గెలుస్తుందని ఏబీపీ- సీ ఓటర్ అభిప్రాయపడింది. బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తేలింది. బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని నివేదిక ఇచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది.అసెంబ్లీ ఫలితాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నారు. కాస్త రిలాక్స్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో సన్నాహకాలు రెడీ చేసుకుందామనుకునే సరికి తాజాగా విడుదలైన సర్వే వారికి షాకిచ్చింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు సంపాదించుకున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో కాస్త నిరాశే ఎదురుకానుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని సర్వే పేర్కొంది. దేశంలో మాత్రం ఈ సారి కూడా మోడీ ప్రభుత్వమే వస్తుందని సర్వే అభిప్రాయపడింది.ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జోష్‌లో ఉంది. దీంతో పార్టీకి మరింత ప్రజాదరణ పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడ్డారని సర్వే తెలిపింది. రాష్ట్రంలో ఉన్న లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను హస్తం పార్టీ దక్కించుకోవడం వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. ఆశావాహులపై ఫోకస్ పెంచింది. పార్టీ అధిష్టానంతో టీ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్‌లో ఉన్నట్లు కన్పిస్తున్నది.
* సింగరేణి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి(Bhupalapalli)లో రేపు (బుధవారం) జరిగే సింగరేణి ఎన్నికలకు(Singareni election) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇందుకోసం 9 పోలింగ్ కేంద్రాల(,Polling centers)ను ఏర్పాటు చేసి 80 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 5,350 మంది కార్మికులు ఓటు హక్కును వినియో గించుకోనున్నారు. అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్‌లో కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి.
* లోక్‌సభ ఎన్నికలపై కిషన్ రెడ్డి జోస్యం
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించకపోయినా అద్భుతమైన విజయాలను భాజపా సొంతం చేసుకుందన్నారు. మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురుచూస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేసేందుకు డిసెంబరు 28న రంగారెడ్డి జిల్లా కొంగర సమీపంలో విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కిషన్ తెలిపారు. రానున్న ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరవుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
* ఆంధ్రలో మూడు నెలల ముందే ఎన్నికల సందడి
ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల ముందే ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ పార్టీ గతంలో గెలిచిన 151 సీట్లకు మించి.. ఈ సారి 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికలో అచితూచి వ్యహరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అలర్టైన జగన్.. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌లను నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నారు.ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలితే మంత్రులను సైతం తప్పించడానికి జగన్ వెనకాడటం లేదు. దీని బట్టి జగన్ గెలుపు కోసం ఎంత పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్, వైసీపీ వర్గాల్లో మొత్తం జగన్ అభ్యర్థుల మార్పు నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల మార్పుపై వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తోన్న నగరి టికెట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో నగరి నియోజకవర్గ టికెట్ తనకు ఇవ్వకపోయినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తానని రోజా తేల్చి చెప్పారు.సీఎం జగనన్న మాట శిరసావహిస్తా స్పష్టం చేశారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. కాగా, నగరి టికెట్ తనకు ఇవ్వకపోయిన ప్రాబ్లమ్ లేదంటూ రోజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారాయి. నగరి టికెట్ ఈ సారి రోజాకు ఇవ్వడం లేదన్న సంకేతాలు అందడంతోనే రోజా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో భాగంగా రోజాను నగరి నుండి తప్పించి ఆమెకు జగన్ ఎక్కడ అవకాశం కల్పిస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
* లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ లను పంపిణీ
జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న వెనకబడిన మండలాలు కొత్తగూడ, గంగారం అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. మంగళవారం మంత్రి కొత్తగూడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఐ.టి.డి.ఎ. పీఓ అంకిత్ తో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండు మండలాల్లో తాగునీటి కొరత అధికంగా ఉన్నందన నిరంతరంగా నీళ్లు అందించే విధంగా అధికారులు దృష్టి సారించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్ర భవనాలకు మరమ్మతులు ఉంటే నిధులు మంజూరు చేస్తానని, అన్ని వసతులు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 14 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తమ దృష్టిలో ఉందని త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేశారు.నిధులు మంజూరైన చోట త్వరితగతిన పనులు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు బ్యాంక్ అదనపు బ్రాంచికి కోరినందున త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాపాలనను అంకిత భావంతో చేపట్టి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత, తదితరులు పాల్గొన్నారు.
* టీఎస్పీఎస్సీ ప్రక్షాళన వేగవంతం చేసిన సర్కార్
ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ వేగం పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కమిషన్‌పై సమీక్షలు నిర్వహించారు. బోర్డు ప్రక్షాళనలో భాగంగానే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరో ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు పంపారు.కానీ రాజీనామాలకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపలేదు. వారు రాజీనామా చేసి రెండు వారాలు గడుస్తున్న గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తుంది. రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా గవర్నర్ కోరినట్లు సమాచారం. రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది.రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నట్లు ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికే మూడు నాలుగు సార్లు గవర్నర్‌ని ప్రభుత్వం సంప్రదించింది. గవర్నర్ నిర్ణయం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.మరోవైపు తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చే సూచనలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. తమిళిసై స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్‌ను నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఆ గవర్నర్ విషయం తెలాల్సి ఉండటంతో ప్రభుత్వం కొంత సందిగ్ధంలో పడింది. ప్రక్షాళన సమయంలో గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది. దీంతో అటు గ్రూప్ 2 అభ్యర్థుల్లో, ప్రభుత్వానికి ఆందోళన మొదలైంది.ఈ గ్రూప్ 2 ఉద్యోగానికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంకా గవర్నర్ విషయం తేల్చకపోవడంతో నూతన బోర్డు అనేది కుదరదు. దీంతో ప్రస్తుత టీఎస్‌పీస్‌సీ కొనసాగింపుతోనే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ తాత్కాలిక అధికారితో గ్రూప్ 2 పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –