Business

అదిరిపోయే ఫీచర్‌ను తెస్తున్న వాట్సాప్‌-వాణిజ్య వార్తలు

అదిరిపోయే ఫీచర్‌ను తెస్తున్న వాట్సాప్‌-వాణిజ్య వార్తలు

* అదిరిపోయే ఫీచర్‌ను తెస్తున్న వాట్సాప్‌

ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ఫ్లాట్‌పామ్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ మోటా కంపెనీ పరిచయం చేస్తుంటుంది. ప్రస్తుతం పలువురు వాట్సాప్‌ స్టేటస్‌ని అప్‌డేట్‌ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కంపెనీ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్‌ వెబ్‌ వర్షన్‌ నుంచి సైతం వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉన్నది. ప్రస్తుతం కేవలం మొబైల్‌లోనే స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ కంపానియన్‌ మోడ్‌లో ఓ భాగం.ఇందులో యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్‌ చేసుకునే వీలుంటుంది. స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్‌ట్‌ను షేర్‌ చేసే అవకాశం వాట్సాప్‌ కల్పిస్తున్నది. ఫీచర్‌ సహాయంతో వెబ్ వెర్షన్‌ లేదంటే.. లింక్‌ చేయబడిన కంపానియన్‌ నుంచి స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.2353.59లో కనిపించింది. ఈ విషయాన్ని WABetaInfo తెలిపింది. అప్‌డేట్‌ అందరికీ అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కలుగనున్నది. స్టేటస్‌ అప్‌డేట్‌ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాబీటాఇన్ఫో పేర్కొంది. ఫీచర్‌ మొదట ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రానున్నది.

వాహనదారులకు షాక్

భారతదేశంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న తరుణంలో రవాణా శాఖ ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్’ (పియుసి) సర్టిఫికేట్‌ల కోసం చార్జీలను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్‌ల కోసం రవాణా శాఖ ఛార్జీలను పెంచనున్నట్లు, దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సీనియర్ డిపార్ట్‌మెంట్ అధికారి వెల్లడించారు. 2011 నుంచి PUC చార్జీలు పెంచలేదని.. రానున్న కొత్త రేట్లు ద్రవ్యోల్బణం రేటుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసారు.కొత్త రేట్లు అమల్లోకి వస్తే ధరలు మునుపటి కంటే దాదాపు 80 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు రవాణా మంత్రి ‘కైలాష్ గహ్లోట్’ తెలిపారు. కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలోనే తెలుస్తుంది.సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం, ప్రతి వాహనం నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత తప్పకుండా పీయూసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీలో PUC ప్రూఫ్ పీజు ద్విచక్ర వాహనాలకు రూ.60, పెట్రోల్ ఫోర్ వీలర్‌ల కోసం రూ. 80, డీజిల్ ఫోర్ వీలర్స్ కోసం రూ. 100. ఈ రేటుపైన 18 శాతం GST కూడా వసూలు చేస్తారు.PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో సుమారు 85 శాతం టూ వీలర్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 27.8 లక్షల కార్లకు, 69.8 లక్షల టూ వీలర్లకు పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో సంబంధిత శాఖ ఇలాంటి వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.

వారణాసిలో స్పైస్‌జెట్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

దర్భంగా నుంచి ముంబయి వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ఆరోగ్యం పరిస్థితి విషమించింది. పైలట్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపారు. ఆ తర్వాత మహిళను వెంటనే ఆసుప్రతికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వృద్ధురాలు కళావతి దేవి (85) తన మనవడితో కలిసి ముంబయికి వెళ్తున్నది. దర్భంగా విమానాశ్రయం నుంచి ముంబయికి ఎస్‌జీ 116 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలు ఆరోగ్యం క్షీణించింది. దీంతో సిబ్బంది ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ తర్వాత వృద్ధురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ వృద్ధురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా విమానం ఒకటిన్నర గంట ఆలస్యంగా ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది.

ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధించే అవకాశం

దేశంలో పెరిగిపోతున్న కోవిడ్‌-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.   ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృ‍ద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది.ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్‌ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్‌ వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్‌ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్‌-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్‌-19 వైరస్‌ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్‌ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్‌-19, డెల్టా వేరియంట్‌, ఒమిక్రాన్‌.. ప్రస్తుతం జేఎన్‌1 వైరస్‌గా మన ముందుకొస్తోంది. డిసెంబర్‌ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది.

దేశవ్యాప్తంగా పెద్ద గృహాలకు భారీ డిమాండ్

దేశవ్యాప్తంగా పెద్ద గృహాలకు భారీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది విశాలమైన ఇళ్ల కోసం సంప్రదించే వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని, ప్రధానంగా 3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ కావాలనుకునే వారు వేగంగా పెరుగుతున్నారని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ హౌసింగ్ డాట్ కామ్ 2024లో భారత నివాస రంగం వృద్ధికి హైదరాబాద్, ముంబై, పూణె నగరాలు కీలక మద్దతివ్వనున్నట్టు తెలిపింది. స్థిరమైన వడ్డీ రేట్లకు తోడు ప్రపంచ అనిశ్చిత సవాళ్ల మధ్య పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది.ఆర్‌బీఐ వరుస సమావేశాల్లో కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు కొవిడ్ మహమ్మారి తర్వాతి పరిణామాల మధ్య ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ బలంగా ఉందని హౌసింగ్ గ్రూప్ సీఈఓ ధృవ్ అగర్వాలా అన్నారు. లగ్జరీ ఇళ్ల డిమాండ్ ముఖ్యంగా రూ. 1-2 కోట్ల మధ్య ఉన్న వాటిని కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. 2024లో ఇది మరింత వేగంగా పెరుగుతుందని డెవలపర్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇళ్ల ధరలు ప్రీ-కొవిడ్ ముందుతో పోలిస్తే 15-20 శాతం పెరిగాయి. సేవల రంగ ప్రభావం ఉన్న నగరాల్లో ధరలు 25-50 శాతం పెరిగాయి. వచ్చే ఏడాది ఇది మెట్రోలకే పరిమితం కాకుండా టైర్-2 నగరాలకు విస్తరించనుందని హౌసింగ్ డాట్ కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ చెప్పారు.

*   లాభాల్లో ముగిసిన బెంచ్‌ మార్క్‌ సూచీలు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా దేశీయ సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇవాళ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకున్నాయి. చివరకు 229.84 పాయింట్లు పెరిగి.. 71,336.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91.90 పాయింట్లు పెరిగి 21,441.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,063 షేర్లు పురోగమించగా.. 1,325 షేర్లు పతనమయ్యాయి. 109 షేర్లు మాత్రం మారలేదు.నిఫ్టీలో దివీస్ లేబొరేటరీస్, హీరో మోటోకార్ప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, ఎన్‌టీపీసీ అత్యధికంగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా మోటార్స్ నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా, చమురు అండ్‌ గ్యాస్, పవర్, మెటల్, ఆటో, హెల్త్‌కేర్‌ ఒక్కొక్కటి ఒక్కో శాతం పెరిగాయి. దీంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z