Sports

జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన వినేశ్ ఫొగాట్

వినేశ్ ఫొగాట్: జాతీయ అవార్డు తిరిగి ఇస్తుందా?

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) నూతన ప్యానెల్‌పై వివాదం కొనసాగుతోన్న వేళ.. వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి రాసిన బహిరంగ లేఖను సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ ప్రకటనల కోసం మాత్రమే మహిళా రెజ్లర్లను తయారు చేశారా? అని లేఖలో వినేశ్‌ ప్రశ్నించారు. తాను గౌరవంగా జీవించే మార్గంలో భారం కాకూడదనే ఉద్దేశంతోనే.. ఖేల్‌రత్న (Khel Ratna), అర్జున అవార్డు (Arjuna Award)లను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెజ్లింగ్‌కు సంబంధించి వినేశ్‌ ఫొగాట్‌.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు.

లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్ ఎన్నిక కావడాన్ని వీరు నిరసించారు. తాను రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు సాక్షి మలిక్‌ ప్రకటించింది. ఆమెకు మద్దతుగా బజరంగ్‌ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. డెఫ్లింపిక్స్‌ (బధిరుల ఒలింపిక్స్‌) పసిడి విజేత వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని తెలిపాడు. తాజాగా వినేశ్‌ ఫోగాట్‌ ఈ జాబితాలో చేరింది. మరోవైపు.. డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z