ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆయేషా మీరా హత్యకేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆమె తల్లిదండ్రులు శంషాద్బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా.. తమ కుమార్తె హత్య కేసులో మళ్లీ విచారణ జరపాలని, విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం వెనుక ఎవరున్నారో తేల్చాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేస్తూ 2018లో ఉమ్మడి హైకోర్టు తీర్పు వచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. సీబీఐ దర్యాప్తు సరిగా లేదని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. సీబీఐ దర్యాప్తు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షన చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు అయేషా తల్లిదండ్రులు.. దర్యాప్తుపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని కేసు దర్యాప్తు పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఐదేళ్లు అవుతున్నా సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదని పిటిషన్ లో తెలిపారు ఆయేషా తల్లితండ్రులు.. ఇక, ఆయేషా మీరా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైదరాబాద్ సీబీఐ, విశాఖపట్నం సీబీఐ అదనపు ఎస్పీ, కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా హత్య ఘటన సంచలనం సృష్టించింది.. ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ తర్వాత సత్యంబాబుకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవితఖైదు, పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. 2010 సెప్టెంబర్లో తీర్పు వెలువరించింది.. అయితే, సత్యంబాబు 2010 అక్టోబర్లో హైకోర్టులో సవాల్ చేశారు.. ఆ తర్వాత విచారణ జరిపిన హైకోర్టు.. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు చెప్పింది.. దీంతో, కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టు అయ్యింది.
👉 – Please join our whatsapp channel here –