జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం(70) ఇంటికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూనీక్ డిజెబిలిటీ ఐడెండిటీ(యూడీఐడీ) కార్డు (UDID card) పోస్టు ద్వారా వచ్చింది. దాన్ని చూసి ఆయన కుటుంబసభ్యులు విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే గంగరాజం చనిపోయి తొమ్మిదిన్నరేళ్లు అవుతుండటమే. దివ్యాంగులకు రాష్ట్రాలు జారీ చేసే సదరం ధ్రువపత్రాల ఆధారంగా కేంద్ర మంత్రిత్వశాఖ యూనివర్సల్ ఐడీ, వైకల్యం ధ్రువపత్రాలను అందించడంలో భాగంగా యూడీఐడీ కార్డు జారీ చేస్తుంది. దీనితో దివ్యాంగుల పింఛను ఇతరత్రా సదుపాయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తన తండ్రి గంగరాజం 2014లో చనిపోయారని, అప్పట్లో వృద్ధాప్య పింఛను తీసుకునేవారని, ఈ కార్డు అప్పట్లో వచ్చి ఉంటే దివ్యాంగుల పింఛను వచ్చేదని ఆయన కుమారుడు మల్లేశం తెలిపారు. ఆయన ఈ కార్డుకు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారో, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చిందో తమకు తెలియదని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –