అమెరికా (USA)కు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ (Apple)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచ్ (Smart Watches)లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు బైడెన్ (Joe Biden) సర్కారు నిరాకరించింది. దీంతో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఆ వాచ్‌ల విక్రయాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అమెరికాలో ‘న్యూఇయర్ హాలిడే’ వేళ ఈ నిషేధం పడటంతో యాపిల్ భారీగా నష్టపోయే అవకాశముంది.
యాపిల్ ఇటీవల విడుదల చేసిన సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్లకు పేటెంట్ సమస్య ఎదురైంది. వీటిల్లోని బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే ఫీచర్ విషయంలో తమ పేటెంట్‌ను యాపిల్ ఉల్లంఘించిందంటూ ‘మాసిమో కార్పొరేషన్’, మరో కంపెనీ దావా వేశాయి. దీంతో ఈ రెండు మోడళ్లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ITC) అక్టోబరులో నిషేధం విధించింది. అయితే, దీనిని పునఃసమీక్షించేందుకు 60 రోజుల గడువు విధించింది.
ఈ నిషేధాన్ని తొలగించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వీటో అధికారం ఉంది. కానీ, యాపిల్ విషయంలో జోక్యం చేసుకునేందుకు వైట్‌హౌస్ తాజాగా నిరాకరించింది. మరోవైపు, ఈ వాచ్ మోడళ్లపై నిషేధం విధిస్తూ ఐటీసీ తీసుకున్న నిర్ణయంలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కేథిరన్ తాయ్ ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీటి విక్రయాలపై డిసెంబరు 26 నుంచి నిషేధాజ్ఞలు అధికారికంగా అమల్లోకి వచ్చినట్లయ్యింది.
కాగా, ఐటీసీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఈ రెండు రకాల వాచ్‌ల విక్రయాలను యాపిల్ నిలిపివేసింది. డిసెంబరు 21న ఆన్లైన్ స్టోర్, డిసెంబరు 24 నుంచి రిటైల్ స్టోర్లలో వీటిని తొలగించింది. క్రిస్మస్, న్యూఇయర్ హాలిడే సీజన్ కావడంతో ఈ నిషేధం.. యాపిల్‌పై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సీజన్లో కంపెనీ విక్రయాలు 300 – 400 మిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోర్టులో యాపిల్ అత్యవసర పిటిషన్..
మరోవైపు, ఈ నిషేధంపై యాపిల్.. స్థానిక కోర్టులో ఎమర్జెన్సీ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పేటెంట్ వివాదంపై తాము వేసిన అప్పీల్‌పై తుది నిర్ణయం వచ్చేదాకా ఆ రెండు మోడళ్లను విక్రయించేందుకు అనుమతించాలని దానిలో కోరింది. నిషేధంపై స్టే ఇవ్వకపోతే తమకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అయితే, దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలివ్వలేదు. ఈ పరిణామాలతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో యాపిల్ షేర్లు స్వల్పంగా కుంగాయి.
👉 – Please join our whatsapp channel here –