DailyDose

జగన్‌ కళ్లలో ఆనందం చూడాలన్నదే ఏకైక కోరిక!

జగన్‌ కళ్లలో ఆనందం చూడాలన్నదే ఏకైక కోరిక!

విద్యాశాఖలో ఆయనో కీలక అధికారి.. ఆయనకు విద్యార్థుల చదువు, వారి సామర్థ్యాలు, అభ్యసన స్థాయిలతో పని లేదు.. సీఎం జగన్‌ కళ్లలో ఆనందం చూడాలన్నదే ఏకైక కోరిక.
సమీక్ష సమావేశాల్లోనూ ఏదో ఒక కొత్త అంశాన్ని చెప్పి, దీన్ని సీఎంకు చెబితే ఆనందపడతారంటూ వ్యాఖ్యానిస్తారు.
అలా టోఫెల్‌, ఐబీ, ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంటూ… చాలా అంశాల్ని అమల్లోకి తెస్తున్నారు.
సీఎం కళ్లలో ఆనందం గురించి ఆలోచిస్తున్నారు తప్ప, భిన్నమైన సిలబస్‌లతో విద్యార్థులు గందరగోళానికి గురవుతారనే స్పృహ లేకపోవడం గమనార్హం!

విద్యార్థులకు ఆంగ్లంలో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అవసరమే.. కానీ, రూ.కోట్లు ఖర్చు చేసే ఉద్దేశంతో ఆ అధికారి టోఫెల్‌ తీసుకొచ్చారు. సీఎం సమీక్షలో దీన్ని గొప్పగా చెప్పారు. ఇంకేముంది.. జగన్‌ కళ్లలో ఆనందం చూశారు. ఆ వెంటనే అమల్లో పెట్టేశారు. పాఠశాల స్థాయిలో టోఫెల్‌ సర్టిఫికెట్లతో వచ్చే ప్రయోజనం ఎంత ఉంటుందో ఆ అధికారికే తెలియాలి? దేశంలో ఏ సంస్థా ఉద్యోగార్థుల్ని టోఫెల్‌ సర్టిఫికెట్‌ అడగదు. మొదట్లో ఈయన మాటలు విని కిందిస్థాయి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యేవారు. ఆయన్ని ఏకంగా ‘వైకాపా అధ్యక్షుడు’ అంటూ పిలుచుకోవడం ప్రారంభించారు.

‘ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో.. మనకే తెలియని పరిస్థితి ఉంటే కిందిస్థాయి వారికి ఏం తెలుస్తా య’ని విద్యాశాఖలోని కీలక అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేషన్‌ కోసం ఆంగ్లం అవసరం.. దాన్ని ఆంగ్ల ఉపాధ్యాయులతో చెప్పిస్తే ఉపయోగం ఉంటుంది. కానీ, టోఫెల్‌ బోధన బాధ్యతలను ఆంగ్ల సబ్జెక్టు టీచర్లకే కాకుండా ఇతర సబ్జెక్టుల టీచర్లకీ, కొన్నిచోట్ల తెలుగు ఉపాధ్యాయులకూ అప్పగించడం గమనార్హం. టోఫెల్‌ అమలుకు ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌(ఈటీఎస్‌) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ‘సమగ్ర శిక్షా అభిమాన్‌’కు ఇస్తున్న నిధులను వాడేస్తున్నారు. టోఫెల్‌ పూర్తిస్థాయిలో అమల్లోకి రాకుండానే మరోసారి సీఎం సమీక్షకు ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ) అమలు చేస్తామంటూ ప్రతిపాదన తెచ్చారు. దీన్ని వచ్చే ఏడాది నుంచి తేనున్నారు. ఇప్పటికే ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర సిలబస్‌, సీబీఎస్‌ఈ, ఆపైన టోఫెల్‌, ఐబీ అంటూ హడావుడి చేస్తున్నారు. ఇన్ని రకాల సిలబస్‌లు ఎక్కడైనా అమలు చేస్తారా..? రాష్ట్ర విద్యార్థుల సామర్థ్యం, అభ్యసన స్థాయితో సంబంధం లేకుండా సిలబస్‌ను అమలు చేస్తున్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

తెలుగు మూగబోనుందా…

టోఫెల్‌, ఐబీలపై చర్చలు కొనసాగుతుండగానే మరోసారి సీఎం సమీక్షలో 9, 10 తరగతుల విద్యార్థులకు ఐచ్ఛికంగా జర్మన్‌, జపనీస్‌, ఫ్రెంచ్‌లాంటి భాషలు నేర్పిస్తామంటూ ప్రతిపాదన తెచ్చారు. సీబీఎస్‌ఈలో భాష ఎంపికకు ఐచ్ఛికాలు ఉంటాయి. వీటిని అమలు చేస్తే మాతృభాష తెలుగు కనుమరుగవుతుంది. తప్పనిసరిగా ఉండే ఆంగ్లంతోపాటు రెండో భాషగా విదేశీ భాషలు ఎంచుకుంటే మాతృభాషకు ఘోరీ కట్టినట్లే. ఇప్పటికే సీబీఎస్‌ఈలో ఐదు సబ్జెక్టులు ఉండడంతో హిందీని తొలగించారు. బోధించడమే తప్ప దీనికి పదో తరగతిలో పరీక్ష ఉండదు.

విద్యార్థులే.. బోధకులా!

ఈ సిలబస్‌లు పూర్తిగా అమలు చేయకుండానే విద్యార్థి దశ నుంచే వ్యాపార అంశాలపై అవగాహన కల్పించేందుకు 9-12 తరగతులకు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీని కోసం హాట్‌మెయిల్‌ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియాతో చర్చిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ఒకటిన నిర్వహించిన సీఎం సమీక్షలో ఫ్యూచర్‌ నైపుణ్యాలపై శిక్షణంటూ మరో కొత్త అంశం తెచ్చారు. ఇందులో భాగంగా 6-8 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాన్సెప్ట్‌, అల్గారిథమ్‌, డేటా ఎనాలసిస్‌, ఏఐ ఎథిక్స్‌- సోషల్‌ ఇంపాక్ట్స్‌పై బోధన.. 9, 10 తరగతులకు ఏఐ టెక్నాలజీ, మెషీన్‌ లెర్నింగ్‌పై ప్రాథమిక అవగాహన, అప్లికేషన్స్‌, అల్గారిథమ్‌ అండ్‌ డేటా ఎనాలసిస్‌, ఏఐ ఎథిక్స్‌, మ్యాథ్స్‌-స్టాటస్టిక్స్‌ నేర్పిస్తారట. ఇంజినీరింగ్‌ విద్యార్థులకే పాఠాలు చెప్పే వారు లేక ఆన్‌లైన్‌ బోధనపై ఆధారపడుతున్నారు. వారిచేత పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీటెక్‌లో ఈ అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేని విద్యార్థులు పిల్లలకు ఏం చెబుతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంజినీరింగ్‌ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా దీన్ని అమలు చేస్తామంటున్నారు. నెలకు రూ.12వేలు ఉపకారవేతనంగా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పిల్లలకు బోధిస్తే బీటెక్‌ విద్యార్థి కెరీర్‌కి ఏం ఉపయోగమో ఉన్నతాధికారికే తెలియాలి.

ఆంగ్లంలో చదవలేని పరిస్థితి…

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే బైజూస్‌ కంటెంట్‌ చెబుతున్నారు. మరో వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్నారు. టోఫెల్‌కు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊపిరి సలపకుండా బోధన ఉండగా.. ఇప్పుడు ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంటున్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాషా, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు నేర్పించడం మంచిదే. దీన్ని ఎవ్వరూ కాదనరు. కానీ ఐదో తరగతి చదివే విద్యార్థి ఆంగ్లంలో చిన్నచిన్న పదాలు చదవలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మెప్పుకోసం మూడు, నాలుగు నెలలకో విధానం తీసుకొస్తే పిల్లల చదువుల పరిస్థితి ఏంటి? వారి అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినవా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z