Health

మైకోబ్యాక్టీరియమ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ వస్తుందా?

మైకోబ్యాక్టీరియమ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ వస్తుందా?

క్షయ కారక బ్యాక్టీరియా.. మానవుల్లో దశాబ్దాల తరబడి తిష్ఠవేయడానికి దోహదపడుతున్న కీలక యంత్రాంగాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయలాజికల్‌ సైన్సెస్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టెమ్‌ సెల్‌ సైన్స్‌ అండ్‌ రీజనరేటివ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. మైకోబ్యాక్టీరియమ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ వస్తుంది. ఎలాంటి లక్షణాలను ప్రదర్శించకుండానే ఇది మానవుల్లో దశాబ్దాల పాటు పాగా వేయగలదు. ఈ సూక్ష్మజీవి మనుగడకు మానవులు అవసరం. చాలా కేసుల్లో.. మనిషిలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని గుర్తించి, తొలగించగలదు. అయితే వ్యాధి లక్షణాలు లేకుండానే కొందరి ఊపిరితిత్తుల్లో.. ఆక్సిజన్‌ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా పాగా వేస్తుంది.

నిద్రాణ స్థితిలో ఉంటుంది. కణవిభజన జరగదు. జీవక్రియ కూడా నిలిచిపోతుంది. ఫలితంగా అది రోగనిరోధక వ్యవస్థను, టీబీ మందులను ఏమార్చగలుగుతుంది. అయితే, ఏదో ఒక దశలో అది తిరిగి క్రియాశీలమై, ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. క్షయ బ్యాక్టీరియాలోని కొన్ని ప్రొటీన్లు పనిచేయడానికి ఐరన్‌-సల్ఫర్‌ సమూహాలే ఆధారం. వీటి సాయంతో.. మానవ ఊపిరితిత్తుల్లోని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆ సూక్ష్మజీవి మనుగడ సాగించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఐరన్‌-సల్ఫర్‌ సమూహాలను ఇది ఎలా నిర్మించుకోగలుగుతోందన్నది తేల్చడానికి భారత శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఎస్‌యూఎఫ్‌ ఒపెరాన్‌ అనే ఒక తరగతి జన్యువులే వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఐఎస్‌సీఎస్‌ అనే మరో జన్యువు కూడా ఈ సమూహాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు. ఐరన్‌-సల్ఫర్‌ క్లస్టర్లను ఉత్పత్తి చేయడానికి ఈ రెండు అంశాలు ఎందుకు అవసరమన్నది శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు.

దీనిపై భారత శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఆక్సిజన్‌ పరిమితంగా ఉన్నప్పుడు ఐఎస్‌సీఎస్‌ జన్యువే ఈ క్లస్టర్లను ఉత్పత్తి చేస్తుందని తేల్చారు. ఆక్సిడేటివ్‌ ఒత్తిడి ఎదురైనప్పుడు మాత్రం సమూహాలు దెబ్బతింటాయి. అలాంటి పరిస్థితుల్లో మరిన్ని క్లస్టర్ల ఉత్పత్తికి ఆవశ్యకత ఏర్పడుతోంది. ఈ సందర్భాల్లో ఎస్‌యూఎఫ్‌ ఒపెరాన్‌ స్విచ్చాన్‌ అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాధి తీవ్రతకు ఐఎస్‌సీఎస్‌ జన్యువు ఎలా కారణమవుతోందన్నది గుర్తించడానికి శాస్త్రవేత్తలు.. ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఐఎస్‌సీఎస్‌ జన్యువు లేని క్షయ బ్యాక్టీరియాతో వాటికి ఇన్‌ఫెక్షన్‌ కలిగించారు. ఫలితంగా వాటిలో వ్యాధి తీవ్ర రూపం దాల్చినట్లు గుర్తించారు. ఐఎస్‌సీఎస్‌ జన్యువు లేకపోవడం వల్ల ఎస్‌యూఎఫ్‌ ఒపెరాన్‌ తీవ్రస్థాయిలో క్రియాశీలమవుతున్నట్లు తేల్చారు. ఐఎస్‌సీఎస్‌, ఎస్‌యూఎఫ్‌ వ్యవస్థలను తగ్గిస్తే ఎలుకల్లో క్షయ బ్యాక్టీరియా దీర్ఘకాలం మనుగడ సాగించగలేదని గుర్తించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z