* జొమాటోకు జీఎస్టీ షాక్
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) డిమాండ్ నోటీసులు పంపించింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. 400 కోట్ల రూపాయల బకాయి పడినట్లు ఆ నోటీసులో జీఎస్టీ పేర్కొనింది. డెలివరీ అనేది సేవ కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాలని డీజీజీఐ స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ఉదయం జొమాటో షేర్లు 4 శాతానికి పైగా పడిపోయాయి.ఇక, షోకాజ్ నోటీసులపై జొమాటో రియాక్ట్ అయ్యారు. తమవైపు నుంచి ఎలాంటి పన్ను బకాయిలూ లేవని ఈ ఫుడ్ డెలివరి సంస్థ తెలిపింది. డెలివరీ భాగస్వాముల తరఫున తాము డెలివరీ ఛార్జీలు వసూలు చేశామని చెప్పింది. అలాగే కస్టమర్లకు తాము నేరుగా డెలివరీ సేవలు అందించలేం.. కాబట్టి, పరస్పర ఆమోదంతో కుదుర్చుకున్న నియమ నిబంధనల ప్రకారం డెలివరీ భాగస్వాములే ఆ సేవలను అందిస్తున్నారని వివరించింది.అయితే, జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలను పొందుపరిచాయి. అందులో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా, మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీ.. సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి దీని నుంచి మినహాయింపు ఉండనుంది. మూడోది ఆహారం ధర, ప్లాట్ ఫామ్ ఫీజుపై ఐదు శాతం పన్ను గురించి తెలియజేస్తుంది. ఈ ట్యాక్స్ ను జీఎస్టీ మండలి 2022 జనవరి నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. అలాగే, జొమాటోకు రూ. 400 కోట్లు కట్టాలని తెలపగా.. స్వీగ్గీకి రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని జీఎస్టీ తెలిపింది. అయితే, ‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదు అని స్వీగ్గీ, జొమాటో తెలిపాయి. జీఎస్టీ బకాయిలతో ఫుడ్ ఆర్డర్ల ఛార్జీలను 2 నుంచి 3 రూపాయలకి స్విగ్గీ, జొమాటో ఆన్ లైన్ ఫుడ్ డెలివరి సంస్థలు పెంచాయి.
* టెస్లాకు పోటీగా మరో సంస్థ
గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా (Tesla)’కు పోటీగా మరో సంస్థ ‘ఈవీ కారు’ తెస్తోంది. ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) తన తొలి ఎలక్ట్రిక్ కారు గురువారం ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ కూపె సెడాన్ మోడల్ ‘ఎస్‌యూ7’.. అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారు షియోమీ హైపర్ ఓఎస్ (Xiaomi’s Hyper OS) వర్షన్‌తో పని చేస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 800 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. సెంట్రల్ కంట్రోల్ డిస్ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, బీ-పిల్లర్ కెమెరా నుంచి అన్ లాక్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో వస్తోంది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ‘ఎస్‌యూ7’ కారును షియోమీ ఆవిష్కరించింది. వివిధ దశల్లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపింది. అయితే భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.
‘వచ్చే 15-20 ఏండ్లు కష్టపడి పని చేస్తే ప్రపంచంలోనే ఐదు అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా నిలుస్తాం. ఓవరాల్‌గా ఆటోమొబైల్ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా కష్ట పడుతున్నది. పొర్చే, టెస్లా సంస్థలతో పోలిస్తే తాము మార్కెట్లో ఆవిష్కరించే ‘ఎస్‌యూ7’ డ్రీం కారు కానున్నది’ అని షియోమీ ఫౌండర్, సీఈఓ లీ జున్ తెలిపారు.ఎంఐ బ్రాండ్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ‘ఎస్‌యూ7’ ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మ్యాక్స్ వేరియంట్లలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో బీఎండబ్ల్యూ ఐ4, బీవైడీ సీల్, టెస్లా మోడల్ 3 కార్లతో పోటీ పడుతుంది. న్యూ మైక్ క్లారెన్స్ స్పూర్తితో షియోమీ ఎస్‌యూ7 కారు ఫ్రంట్ డిజైన్ రూపుదిద్దుకున్నది. మైక్ క్లారెన్స్ 750ఎస్ తరహా ఎస్‌యూ7 హెడ్ లైట్లు స్లిమ్డ్ డౌన్ వర్షన్, స్లిమ్ ర్రామ్, టెయిల్ లైట్స్, లైట్ బార్ కనెక్టింగ్ టూ వర్షన్ ఉంటాయి. హయ్యర్ వేరియంట్లలో యాక్టివ్ రేర్ వింగ్ ఫీచర్ జత చేశారు.షియోమీ ఎస్‌యూ7 కారు రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తున్నది. రేర్ వీల్ డ్రైవ్ ఎడిషన్ విత్ 220 కిలోవాట్ల మోటార్, 495 కిలోవాట్ల డ్యుయల్ మోటార్ సెటప్ విత్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తున్నది. 220కిలోవాట్ల మోటార్ గరిష్టంగా 295 హెచ్‌పీ విద్యుత్ వెలువరించడంతోపాటు గంటకు 210 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 495 కిలోవాట్ల డ్యుయల్ మోటార్ గరిష్టంగా 664 హెచ్‌పీ విద్యుత్ వెలువరించడంతోపాటు గంటకు 265 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.ఎంట్రీ లెవల్ ఎస్‌యూ7 కారులో లిథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్పీ), టాప్ వేరియంట్లో లార్జర్ సీఏటీఎల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ ఎంత అన్నది వెల్లడించలేదు. ఎస్‌యూ7 కారులో టూ థీమ్ ఇంటీరియ్ థీమ్స్ ఉంటాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంటట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ ప్లే ఆన్ డాష్ బోర్డ్ ఉంటాయి. ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి, ఫిబ్రవరి నుంచి డెలివరీ చేపట్టనున్నదని తెలుస్తున్నది.
* మరో సంస్థను సొంతం చేసుకున్న అదానీ
అదానీ గ్రూప్ పవర్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా సొంతం చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూట్ క్లీయర్ చేసుకున్నారు. ఈ రెండు సంస్థల మధ్య కొనుగోలు ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ కంపెనీని పీఎఫ్సీ (PFC) కన్సల్టింగ్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ వార్తలు బయటకు రావటంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి 1082.40 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి.కాగా, హల్వాద్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్.. దీన్ని పీఎఫ్సీ కన్సల్టింగ్ లిమిటెడ్ రూపొందించింది. ఫేజ్- 3 పార్ట్ ఎ ప్యాకేజీ కింద ఖవ్రా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 7జీడబ్ల్యూ పునరుత్పాదక శక్తిని రవాణా చేయడమే దీని యొక్క లక్ష్యం.. టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది. రాబోయే 24 నెలల్లో కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనుందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.అయితే, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సుమారు 301 కిలో మీటర్ల మేర ట్రాన్స్ మిషన్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు దాదాపు 3 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ప్రాజెక్ట్ లో 765కేవీ హల్వాద్ స్విచింగ్ స్టేషన్ నిర్మాణం కూడా ఉండనుంది. ఇది కాకుండా అదానీ గ్రూప్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ ఫోర్ లిమిటెడ్ 49:51 శాతం వాటాతో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయడానికి యూఏఈకి చెందిన ఎస్యాసాఫ్ట్ హోల్డింగ్స్ తో అదానీ గ్రూప్స్ ఒప్పందం చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ కింద కంపెనీ ఇండియాతో పాటు విదేశాల్లో స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్టులపై వర్క్ చేయనుంది.
* ఆజాద్ ఇంజినీరింగ్ లిస్టింగ్ అదుర్స్
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్లు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి (Azad Engineering Listing). ఇష్యూ ధర రూ.524తో పోలిస్తే బీఎస్ఈలో 35.49 శాతం ప్రీమియంతో రూ.710 దగ్గర అరంగేట్రం చేసింది. ఎన్ఎస్ఈలో 37.40 శాతం పుంజుకొని రూ.720 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,219.19 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారు కనీసం 28 షేర్లకు రూ.14,672 పెట్టుబడిగా పెట్టారు. వారికి లిస్టింగ్‌లో ఒక్కో లాట్‌పై రూ.5,488 లాభం వచ్చింది.గత శుక్రవారం ముగిసిన ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. రూ.240 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.500 కోట్లు విలువ చేసే షేర్లను ‘ఆఫర్ ఫర్ సేల్’ కింద విక్రయించారు. ఐపీఓలో ధరల శ్రేణిని రూ.499- 524గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను మూలధన వ్యయం, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ, ఇంధన, చమురు పరిశ్రమలకు చెందిన కంపెనీలకు ఆజాద్ ఇంజినీరింగ్ తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది. జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్ ఇంటర్నేషనల్, మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, ఈటన్ ఏరోస్పేస్, ఎంఏఎన్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఆజాద్ ఇంజినీరింగ్‌కు కస్టమర్లుగా ఉన్నాయి.ఆజాద్ ఇంజినీరింగ్‌లో సచిన్ తెందూల్కర్, సైనా నెహ్వాల్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, నిఖత్ జరీన్ వంటి ప్రముఖ క్రీడాకారులకు వాటాలున్నాయి. లిస్టింగ్ తర్వాత తెందూల్కర్ పెట్టుబడి విలువ దాదాపు ఏడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఆయన ఒక్కో షేరును రూ.3,423 చొప్పున 14,607 షేర్లను కొనుగోలు చేశారు. తర్వాత కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించింది (Stock split). అలాగే ఒక్కో షేరుకు మరో ఐదు షేర్లను బోనస్‌గా జారీ చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే తెందూల్కర్ షేర్లు 4.5 లక్షలకు చేరాయి. ఫలితంగా ఒక్కో షేరు సగటు కొనుగోలు ధర రూ.110గా ఉంది. తాజా ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ కింద ఆయన షేర్లను విక్రయించలేదు. ఈ లెక్కన ఆయన దాదాపు రూ.ఐదు కోట్లు పెట్టుబడిగా పెట్టగా.. తాజా షేరు ధర ప్రకారం అది దాదాపు రూ.32 కోట్లకు చేరింది.
* 15 శాతం పెరిగిన ధరలు
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 31 శాతం పెరిగి దాదాపు 4.77 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని ప్రముఖ స్థిరస్తి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ, నివాసాల ధరలు సగటున 15 శాతం పెరిగినప్పటికీ ఇళ్ల విక్రయాలు పెరగడం గమనార్హం. గతేడాది దేశవ్యాప్తంగా పధాన ఏడు నగరాల్లో 3,64,870 ఇళ్లు అమ్ముడవగా, ఈసారి 4,76,530కి చేరాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో కొత్త నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రథమార్థంలో అంతర్జాతీయ పరిణామాలు, ఇతర అంశాల ఒత్తిడి ఉన్నా అమ్మకాలు రికార్డు గరిష్టానికి చేరినట్టు ‘ అనరాక్ ఛైర్మన్ అనూజ్ పురి చెప్పారు. అనరాక్ నివేదిక ప్రకారం, ముంబై మెట్రోలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా 40 శాతం పెరిగి 1,53,870 యూనిట్లుగా నమోదయ్యాయి. దీని తర్వాత పూణెలో 52 శాతం వృద్ధితో 86,680 యూనిట్లు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 3 శాతం పెరిగి 65,625 యూనిట్లు, బెంగళూరులో 29 శాతం పెరిగి 63,980 యూనిట్లు, హైదరాబాద్‌లో 30 శాతం వృద్ధితో 61,715 యూనిట్లు, కోల్‌కతాలో 9 శాతం అధికంగా 23,030 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో 34 శాతం పెరిగి 21,630 యూనిట్లుగా నమోదయ్యాయి.
👉 – Please join our whatsapp channel here –