గౌరవ వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్న సొంత సైన్యంపై జగన్ ప్రభుత్వం కనికరం చూపలేదు. పైగా.. ప్రభుత్వంపైనే ధిక్కార స్వరం వినిపిస్తారా? అంటూ వారిని విధుల నుంచి తొలగిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమలాపురం పురపాలక సంఘం పరిధిలో గురువారం వాలంటీర్ల తొలగింపులు చేపట్టింది. సమ్మె చేస్తున్నందున అమలాపురంలోని సూర్యనగర్, రామనగర్ ప్రాంతాలకు చెందిన వాలంటీర్లు రెడ్డి సతీశ్‌కుమార్, యనమదల ఉమామహేశ్వరరావు, ఎ.బాబాజన్లను తొలగిస్తున్నట్లుగా ఆ పురపాలక సంఘం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినందున వారి స్థానంలో ఇన్ఛార్జులకు బాధ్యతలు అప్పగించాలని సంబంధిత వార్డు సచివాలయాల పరిపాలన కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. ఈనెల 26 నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెకు దిగారు. అనేకచోట్ల అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. కొన్నిచోట్ల వైకాపా నేతలు బెదిరింపులకూ దిగారు. ఇవేవీ పట్టించుకోకుండా సమ్మెను కొనసాగించిన వారిని తొలగించాలని నిర్ణయించారు. సమ్మెలో కొనసాగుతున్న వాలంటీర్ల జాబితాను అధికారులు తయారు చేశారు. దశల వారీగా వేటు వేయాలని నిర్ణయించారు. గత నాలుగున్నరేళ్లుగా కార్యకర్తల కంటే మిన్నగా వైకాపాకు ప్రచారం చేస్తున్నందుకు సీఎం జగన్ ఇచ్చే బహుమతి ఇదేనా? అని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు.
చట్ట విరుద్ధంగా తొలగింపు…!
వాలంటీర్లకు షోకాజ్ నోటీసు ఇచ్చి వారి వివరణ తెలుసుకోకుండా తొలగించడం చట్ట విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శకాలూ అలాగే రూపొందించినట్లు గతంలో ఓ కేసులో ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. అకారణంగా తొలగించారని వాలంటీర్లు భావిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. అదే ప్రభుత్వం ఇప్పుడు తొలగింపులు చేపట్టడం చట్ట వ్యతిరేకమని వాలంటీర్లు అంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –