DailyDose

విశాఖలో తక్కువ ధరకే భూములు దొరుకుతున్నాయా?

విశాఖలో తక్కువ ధరకే భూములు దొరుకుతున్నాయా?

కారు చౌక బేరం..! అది కూడా విశాఖలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో ఎకరం కోటి రూపాయలే.. అదేంటీ అంత తక్కువ ధరకే అక్కడ భూములు దొరుకుతున్నాయా.. అని ఆశ్చర్యపోకండి! ప్రభుత్వ పెద్దల ఆశీస్సులుంటే ఏదైనా సాధ్యమే ఇక్కడ. విశాఖలో అంతర్జాతీయ స్కూల్‌ ఏర్పాటు పేరుతో బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు జగన్‌ ప్రభుత్వం రూ. 707.85 కోట్ల విలువైన భూమిని.. రూ. 11.25 కోట్లకే కట్టబెట్టింది. ‘ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బెంగళూరు అండ్‌ నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌ (టీఐఎస్‌బీ/ఎన్‌పీఎస్‌) గ్రూప్‌’ అనే సంస్థకు మధురవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఎకరం రూ. కోటి చొప్పున 11.25 ఎకరాలు కేటాయించింది. దీనికి సంబంధించి ఈ నెల 22న జారీ చేసిన జీవో గురువారం వెలుగులోకి వచ్చింది. విశాఖలో స్కూలు కోసం భూమి కేటాయించాల్సిందిగా టీఐఎస్‌బీ/ఎన్‌పీఎస్‌ గ్రూప్‌ దరఖాస్తు చేసుకుంది.

అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చ.గజం ధర రూ. 65 వేలు ఉందని, ఆ లెక్కన ఎకరం రూ. 31.46 కోట్లు చొప్పున ఇవ్వవచ్చని కలెక్టర్‌ సిఫారసు చేశారు. అంటే మొత్తం భూమి విలువ రూ. 353.92 కోట్లు. కలెక్టర్‌ సిఫారసుపై ఈ నెల 6న జరిగిన ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సమావేశంలో చర్చించినట్లు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ ప్రభుత్వానికి తెలిపారు. 11.25 ఎకరాల్ని రూ. 707.85 కోట్లకు ఇవ్వవచ్చని తేల్చినట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఎకరం రూ.కోటికే భూమి కేటాయించేసి ‘పెద్ద మనసు’ చాటుకుంది. ఆ సంస్థ ఏర్పాటు చేసే స్కూల్లో 25 శాతం సీట్లు స్థానికులకు ఉచితంగా ఇస్తుందట! మరో 25 శాతం సీట్లు విద్యా హక్కు చట్టం కింద ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో భర్తీ చేస్తుందట. పావువంతు సీట్లు ఉచితంగా ఇస్తే మాత్రం.. రూ.వందల కోట్ల విలువైన భూముల్ని ఇలా చౌకగా కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

భీమిలి ఎమ్మెల్యేకు 32 సెంట్లు
విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ సర్వే నంబరు 40/6లో 32 సెంట్ల ప్రభుత్వ భూమిని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు భార్య జ్ఞానేశ్వరి పేరు మీద కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. 32 సెంట్ల భూమిని రూ. 1.28 కోట్లకు కేటాయించింది. ప్రస్తుతం అక్కడ బహిరంగ మార్కెట్‌లో విలువ అంతకు రెట్టింపు ఉండగా, ఎమ్మెల్యేకు చౌక ధరకు కట్టబెట్టింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నజరానా ఇది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z