DailyDose

బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు-తాజా వార్తలు

బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు-తాజా వార్తలు

బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు

లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. జనవరి 3వ తేదీ నుంచి భారాస.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్‌ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌ వేదికగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.జనవరి 3న ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంతో సన్నాహక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి, 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతాయని భారాస నేతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. భారాస అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు ఆ పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

* విశాఖలో వైసీపీకి భారీ షాక్

విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారు. మొన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడారు. తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పార్టీని వీడారు. విశాఖలో దక్షిణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చూస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. సీతంరాజు సుధాకర్‌కు విశాఖ దక్షిణలో మంచి పట్టుంది. అంతేకాదు సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయన సైతం పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏందంటే సీతంరాజు సుధాకర్ టీడీపీ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే విశాఖలో టీడీపీ బలం మరింతగా పెరుగుతోందన్నమాట.

వైసీపీ హామీలపై టీడీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదు

అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైకాపా  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చామని.. ఆ మేరకు మొదటి ఏడాది రూ.11వేలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా అంగన్వాడీల పది డిమాండ్లు అంగీకరించామని.. అయితే, ఎన్నికలకు వెళ్తున్నామని.. సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. విజయనగరంలో మంత్రి మాట్లాడారు.వైకాపా హామీల అమలుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సహజమన్నారు. స్థానిక పరిణామాలు, పరిస్థితులు, సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగేదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైకాపాకు ఎలాంటి నష్టం లేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చలు జరుగుతున్నాయని.. రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మార్పు ఉండబోదనే నమ్మకాన్ని బొత్స వ్యక్తం చేశారు.

ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత లేదు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇంఛార్జ్‌ల మార్పు కొన్ని ప్రాంతాల్లోని నేతలు అసంతృప్తి వ్యక్తం చేసేలా చేసింది.. అంతేకాదు.. కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఇతర పార్టీలో చేరుతున్నారు.. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ఇంఛార్జీల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని యాత్రలు చేసిన నారా చంద్రబాబు నాయుడును మరోసారి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. బీసీ డిక్లరేషన్ , గ్యారెంటీలు ప్రజలను మోసం చేయడానికే అనే దుయ్యబట్టారు. ఇక, కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు అనేక కారణాలు ఉన్నాయని.. సామాజిక సమీకరణాలు కొన్ని చోట్ల, ఆర్థిక వ్యవహారాలు మరికొన్ని చోట్ల.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు కారణంగా చెప్పుకొచ్చారు..అయితే, ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్లే కొంత మంది పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యే వంశీ.. జనసేన పార్టీలో చేరడంపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ వంశీకి పోటీ చేసే అవకాశం ఇస్తే భారీ తేడాతో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి. కాగా, తొలి జాబితాలో మంత్రులు సహా 11 మంది స్థానాలు మార్చిన వైసీపీ అధిష్టానం.. రెండో జాబితా సిద్ధం చేస్తోంది.. రెండో జాబితాలో ఏకంగా 30 మందిని మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోన్న విషయం విదితమే.

కాంగ్రెస్ సీపీఐ పార్టీల మధ్య విభేదాలు లేవు

కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య విభేదాలు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని, ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుష్ట సంప్రదాయానికి తెరలేపిందని, కార్మికులను చెడగొట్టారని విమర్శించారు. సింగరేణి ఎన్నికల వేళ కార్మికులను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించామని తెలిపారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

 ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. రూ.2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో అన్ని కోర్సుల్లో కలిపి 10 లక్షల 59 వేల 233 మంది విద్యార్థులు ఉంటే.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసే సరికి 9 లక్షల 77 వేల 44 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఈ క్రమంలో మరోసారి ఫీజు చెల్లించేందుకు అవకాశమిచ్చింది ఇంటర్ బోర్డు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 28, 2024 నుండి ప్రారంభం కానుండగా.. రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z