DailyDose

ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు-నేర వార్తలు

ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు-నేర వార్తలు

ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు

 కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదు అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా స్థానిక సమాచారం. కుటుంబం ఒంటరిగా ఉండేదని, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండేవారని బంధువులు పోలీసులకు తెలిపారు.బాధిత కుటుంబ సభ్యులు చివరిగా జూలై 2019లో కనిపించారు. అప్పటి నుంచి వారి నివాసం తాళం వేసి ఉంది. ఇంటి ప్రధాన గుమ్మం తలుపు పగిలిపోయి ఉండటాన్ని సుమారు రెండు నెలల క్రితం స్థానికులు గుర్తించారు. అయినప్పటికీ వారు పోలీసులకు సమాచారం అందించలేదు. బాధిత ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు.. ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు (మంచాలపై రెండు, నేలపై రెండు), వేరే గదిలో మరో అస్థిపంజరం కనిపించాయి. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (ఎస్‌ఓసిఓలు) సాక్ష్యాలను సేకరించారు. ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు.

* అన్నను చంపిన తమ్ముడు

చెట్టుకు ఉరివేసుకొని, యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బొంరాస్ పేట్ మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, చౌదర్ పల్లి గ్రామానికి చెందిన జోగు రాములు (25) హైదరాబాదులో లేబర్ పని చేస్తుండేవాడు.మృతుడు గతంలో తన సొంత అన్నను లక్నాపూర్ సమీపంలో చంపి 3 నెలలుగా జైలు జీవితం గడిపి గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన రాములు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుని సోదరుడు జోగు శీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

* కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్‌

ఓవర్‌ టేక్‌ చేసేందుకు బైక్‌కు దారి ఇవ్వలేదన్న కోపంతో క్యాబ్‌ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. (Cab driver stabbed ) ఈ సంఘటన కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సంగం విహార్‌ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్‌లోని ఒక కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను కారులో ఎక్కించుకున్నాడు. మరో ఉద్యోగి పికప్ కోసం మెహ్రౌలీకి వెళ్తుండగా రాత్రి 8.40 గంటల సమయంలో ట్రాఫిక్ జామ్‌లో కారు చిక్కుకుంది.కాగా, బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓవర్‌ టేక్‌ కోసం దారి ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్‌ మనోజ్‌ను అడిగారు. అయితే బైక్‌ వెళ్లే గ్యాప్‌ లేకపోవడంతో దీనికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో బైక్‌పై ఉన్న ముగ్గురు అతడితో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి కత్తితో మనోజ్‌ ఛాతిపై పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు.మరోవైపు కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్‌ మనోజ్‌ను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో అతడు మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మైనర్‌ అయిన ఒక నిందితుడ్ని గుర్తించి అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

మహిళ పైకి దూసుకెళ్లిన లారీ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డు బస్టాప్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే ఇబ్రహీంపట్నం వడ్డెర బస్తీకి చెందిన వరికుప్పల ఎల్లమ్మ (50), ఆమె భర్త కృష్ణయ్య ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో లారీ బైకును ఢీ కొట్టడంతో మహిళ రోడ్డు పై పడింది. దీంతో వేగంగా వస్తున్న లారీ మహిళ పై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో భర్త కృష్ణయ్య తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

కోట్ల విలువైన పాము విషం స్మగ్లింగ్‌ 

‘వైల్డ్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ బ్రాంచ్‌’, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కోట్ల రూపాయల విలువైన పాము పాయిజన్ పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. పాము విషం స్మగ్లింగ్‌ గురించి పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ మేరకు దాడి చేశారు. కలకత్తా నుంచి అసన్సోల్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. నిజాం ప్యాలెస్ నుంచి ఈ స్మగ్లర్ల కదలికలపై ‘వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో’ నిఘా పెట్టినట్లు సమాచారం.పురూలియాలోని కన్సావతి రేంజ్, అసన్సోల్ ఫారెస్ట్ రేంజ్‌కు చెందిన నిందితులు అసన్సోల్ నుంచి పురూలియాకు వాహనంలో పాము విషాన్ని తీసుకెళ్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అసన్‌సోల్‌లోని దిసర్‌ఘర్ సమీపంలో విష స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారిని సమీపంలోని సంక్తారియా అవుట్‌పోస్టుకు తరలించారు. పాము విషంతో పాటు కారును, అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాము విషాన్ని క్రిస్టల్, లిక్విడ్ ఫార్మాట్‌లో రెండు ఆంపౌల్స్‌లో తీసుకువెళ్తున్నారు. అటవీ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నిందితులు ఇంట్రా-స్టేట్ పాము విషం స్మగ్లింగ్ రింగ్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులను ఈ రోజు (శుక్రవారం) కోర్టులో హాజరు పరుస్తామని అసన్‌సోల్ రేంజ్ ఆఫీసర్ సంజీవ్ పతి తెలిపారు. సాధారణంగా పాము విషం ధర పాము రకాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఈ విషం ఏ పాముకు చెందిందనే విషయం ఇంకా తెలియరాలేదు. వివిధ రకాల పాముల విషం గ్రాము ధర 6 లక్షల రూపాయల వరకు ఉంటుందని అటవీ శాఖ వర్గాల సమాచారం. అంటే ఇది బంగారం కంటే ఖరీదైనదన్నమాట. తాజాగా దొరికిన పాము విషం విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం

లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z