ScienceAndTech

క్రిప్టోకరెన్సీలతో అమెరికా భద్రతకు పెనుముప్పు

USA Considers CryptoCurrency As A Threat To Nation

క్రిప్టోకరెన్సీలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్నుచిన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన సోమవారం శ్వేత సౌధంలో హాడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిలియన్ల కొద్ది అక్రమ సంపాదనకు ఇవి మార్గంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ చేసేవారికి వర్చ్యూవల్‌ కరెన్సీలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. త్వరలో ఫేస్‌బుక్‌ ప్రతినిధులు అమెరికా ప్రభుత్వంతో క్రిప్టోకరెన్సీ లిబ్రపై చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ‘‘క్రిప్టోకరెన్సీలను చాలా మంది అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారింది. ఫేస్‌బుక్‌, బిట్‌కాయిన్‌ నిర్వహకులు మిగిలిన సంస్థల వలే కచ్చితంగా యాంటీ లాండరింగ్‌, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చర్యలు తీసుకోవాలి. ’’ అని స్టీవెన్‌ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలను చలామణి చేసే సంస్థలను నియంత్రించడంలో అమెరికా ముందువరుసలో ఉంటుందన్నారు. ప్రభుత్వం డిజిటల్‌ అసెట్‌ సర్వీస్‌ప్రొవైడర్లను షాడో కరెన్సీల నిర్వహణకు అంగీకరించమని వెల్లడించారు.