Politics

బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?

బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఎక్స్‌లో వైరల్‌ అవుతుండగా.. ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

బండ్ల గణేష్‌ మొదటి నుంచి కాంగ్రెస్‌ హార్డ్‌కోర్‌ అభిమాని. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పి మరీ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో.. మరోసారి ట్రోలింగ్‌ మెటీరియల్‌ అవుతారేమోనని కొందరు భావించారు. కానీ, ఈసారి బండ్ల గణేష్‌ జోస్యం తప్పలేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టి.. కాంగ్రెస్‌ అధికారం కైవసం చేసుకుంది.

కాంగ్రెస్‌తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్‌ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే..

సంక్రాంతిలోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు ఏదైనా కార్పొరేషన్‌ అప్పజెప్పొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్‌లలో వీలు కాకుంటే.. సినీ రంగానికి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా బండ్ల గణేష్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చా నడుస్తోంది. ఇవేవీ కాకుంటే.. పార్టీ తరఫున అయినా ఆయనకు కీలక పదవి కచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్‌ మాత్రం పదవులక్కర్లేదనని.. పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. మరి బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?.. లేదా.. స్పష్టత రావాలంటే.. ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z